DRAINAGE పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సత్తెనపల్లిలోని బస్టాండ్ ఎదుట ఉన్న రెస్టారెంట్‌లో డ్రైనేజీ శుభ్రపరిచేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగిన ఇద్దరు కార్మికులు, రెస్టారెంట్ యజమాని ప్రమాదవశాత్తూ మృతిచెందారు. బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ రెస్టారెంట్ భవనం యజమాని కొండలరావు.. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు.. ఇద్దరు కూలీలను తీసుకొచ్చారు. మ్యాన్‌హోల్‌లోకి దిగిన ఇద్దరు కూలీలు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. ఆయన కూడా అందులోకి దిగారు. ఎంతసేపటికి అతడు కూడా బయటకు రాకపోవడంతో.. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ముగ్గురూ డ్రైనేజీలోనే మృతిచెందినట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి.. శవపరీక్ష నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తమను అదుకోవాలని కూలీల కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. సత్తెనపల్లి పోలీసులు వైద్యశాలకు చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బాధితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిహరం ప్రకటించే వరకూ ఆందోళన విరమించేది లేదని బాధితులు డిమాండ్ చేశారు. బాధితులకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఇవీ చదవండి: