Farmers Suicide: అప్పులు తీర్చే మార్గం కానరాక రాష్ట్రంలో ముగ్గురు రైతులు బలవన్మరణం చెందారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగుకు చెందిన మెడబోయిన రామకృష్ణ (39) తనకున్న రెండు ఎకరాల భూమితో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని మిరప సాగు చేశారు. వరుసగా రెండేళ్లు దిగుబడులు లేక రూ.10 లక్షల వరకు అప్పులు పెరిగిపోయాయి. రుణం తీర్చే దారి కానరాక సోమవారం పొలం వద్ద పురుగుల మందు తాగారు. చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు.
* నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం హరివరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి(55) తనకున్న తొమ్మిది ఎకరాలకు తోడుగా 40 ఎకరాల పొలాన్ని ఎకరా రూ.22 వేల చొప్పున కౌలుకు తీసుకొన్నారు. ఐదేళ్లుగా శనగపంట సాగు చేశారు. పెట్టుబడి కోసం చేసిన రూ.10 లక్షల అప్పు తీర్చలేక మనస్తాపానికి గురై విషపు గుళికలను మింగారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.
* కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరుకు చెందిన ఉప్పర తిక్కయ్య(62) తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరో ఏడెకరాలు కౌలుకు తీసుకొన్నారు. సాగులో నష్టం వాటిల్లింది. అప్పులు చెల్లించే మార్గంలేక ఆదివారం అర్ధరాత్రి గుళికలు మింగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు.
ఇదీ చదవండి: అధికారుల అలసత్వానికి... అన్నదాత బలి