Mahesh Bank hacking case: మహేష్ బ్యాంకు హ్యాకింగ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నైజీరియన్లతో పాటు మరో మహిళను పోలీసులు దిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురి ఖాతాల్లోకి నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు, వీళ్లకు గల సంబంధాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హ్యాకింగ్‌లో భాగంగా ఇప్పటికే 12.9 కోట్ల రూపాయలు పలు ఖాతాలకు బదిలీ అయినట్టు గుర్తించిన పోలీసులు.. అందులో 3కోట్ల వరకు నిలుపుదల చేశారు. మహేష్ బ్యాంక్‌కు సంబంధించిన మూడు ఖాతాలు దేశంలోనే వివిధ 120 బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్లు తెలుసుకున్నారు. అందులో ముగ్గురిని ప్రస్తుతం పోలీసులు పట్టుకున్నారు.
సర్వర్ లోపాలే కారణమా?
Hyderabad bank hacking case : సర్వర్ నిర్వహణ లోపాలే హ్యాంకింగ్‌కు దారి తీశాయని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆరు నెలల క్రితం అపెక్స్ బ్యాంకు సర్వర్ హ్యాక్ అయిన విధానం.. ప్రస్తుతం మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాక్ విధానం ఒకే విధంగా ఉండటాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. రెండు బ్యాంకులకు కూడా ఒకే సంస్థ సర్వర్ల రక్షణకు సంబంధించిన సాఫ్ట్ వేర్‌ను ఏర్పాటు చేసినట్లు సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది. సర్వర్లు హ్యాక్ కాకుండా కావాల్సిన ఫైర్ వాల్స్, ఇతర రక్షణ చర్యలను సాఫ్ట్ వేర్ సంస్థ చూస్తోంది. అపెక్స్ బ్యాంకు సర్వర్ హ్యాక్ అయినప్పుడే.. సాఫ్ట్ వేర్లో ఏమైనా లోపాలున్నాయా అని సదరు సంస్థకు చెందిన నిర్వాహకులు సమీక్షించుకుని ఉంటే.. మరోసారి హ్యాకింగ్ జరిగి ఉండేది కాదేమోనని సైబర్ క్రైం పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి:
Mahesh Bank case Updates: సాఫ్ట్‌వేర్‌లోని లోపాలే మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాకింగ్‌కు కారణం..