వారిది అందమైన కుటుంబం. ఇద్దరు కుమారులతో సాఫీగా సాగుతోంది వారి జీవితం. ఈ క్రమంలో పెద్ద కుమారుడు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. మద్యం తాగి తరుచుగా ఇంట్లో వారితో గొడవపడేవాడు. అన్న చెడు అలవాట్ల వల్ల తమ కుటుంబ పరువు పోతుందని భావించిన తమ్ముడు.. ఎవరూ లేని సమయంలో అన్నను నాటు తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం వీరంపాలెం గ్రామానికి చెందిన కోతాల సుబ్బారావుకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో కుమార్తెలకు వివాహం చేసి... ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు రాజేష్ చెడు అలవాట్లకు బానిసై.. నిత్యం ఇంట్లో గొడవలు పడేవాడు. రాజేష్ తన తండ్రిని ఆటో కావాలని వేధించడంతో ఒక ఆటో కొనిచ్చారు. దానికి నెలవారీ వాయిదాలు సక్రమంగా చెల్లించలేదని ఫైనాన్స్ సంస్థ ఆ ఆటోని సీజ్ చేశారు. దాంతో మరింత కుంగిపోయిన రాజేష్ రోజూ మద్యం తాగి తండ్రితో, తమ్ముడు కృష్ణమోహన్‌తో గొడవలు పడేవాడని పోలీసులు తెలిపారు. ఇటీవల జరిగిన గొడవలో తండ్రి, తమ్ముడిపై రాజేష్ కోడికత్తితో దాడి చేశాడని అన్నారు.
అన్న ప్రవర్తనపై విసిగిపోయిన కృష్ణమోహన్ అతనిపై కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా కృష్ణమోహన్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వారు పెళ్లి చేసుకోవాలని తొందర పెట్టటంతో.. తన అన్న రాజేష్ బతికి ఉంటే తనకు పెళ్లి కాదని.. కుటుంబ పరువు పోతుందని భావించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాటు తుపాకితో అన్న వీపుపై కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. అనంతరం పారిపోయి బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడని ... వారు సుబ్బారావుకి తెలిపారని అన్నారు.
ఇదీ చదవండి: ACCIDENT: ప్రకాశం జిల్లాలో ప్రమాదం..ఆటో నుంచి పడి నలుగురు మృతి