triple murder : పగలంతా పనులు చేసుకుని.. ఆదమరచి నిద్రిస్తున్న ముగ్గురిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. పంజాబ్‌కు చెందిన హర్పాల్ సింగ్... డిచ్‌పల్లిలో హార్వెస్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న జోగిందర్ సింగ్ అనే వ్యక్తి.. వారం కిందట పంజాబ్ నుంచి ఓ హార్వెస్టర్ ఇక్కడికి తీసుకొచ్చారు. వీరిద్దరూ డిచ్‌పల్లి సమీపంలోని నాగపూర్‌గేటు వద్ద ఉన్న షెడ్డులో ఉంటున్నారు. జహీరాబాద్‌కు చెందిన బానోత్ సునీల్.... వీరి షెడ్డు వద్దకు వస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి షెడ్డు వద్దే నిద్రించిన ముగ్గురూ... తెల్లవారినా మేల్కొనలేదు. నిన్న మధ్యాహ్నం అనుమానంతో స్థానికుడు అక్కడికి వెళ్లగా.. హర్పాల్‌సింగ్, జోగీందర్‌సింగ్, సునీల్‌లు దారుణహత్యకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది.
తలపై సుత్తితో కొట్టి
three brutally killed: స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.... హత్యలపై విచారణ చేపట్టారు. ముగ్గురి తలలపై ఒకే చోట సుత్తితో కొట్టి చంపినట్లుగా గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో పరిసర ప్రాంతాల్లో రోజంతా గాలించినప్పటికీ... అక్కడ ఏ చిన్న ఆధారామూ లభించలేదు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు పరిశీలించగా... ఓ వ్యక్తి వచ్చి వెళ్లినట్లు తెలిసింది. దుండగులు హత్యలకు పాల్పడే ముందు రెక్కీ నిర్వహించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జీవనోపాధి కోసం వచ్చిన ఈ ముగ్గురి వద్ద పెద్దగా డబ్బుకూడా లేకపోగా... ఇక్కడి వారితో తగాదాలు సైతం లేవని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వరుస హత్యలకు పాల్పడిందెవరనే దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన నిజామాబాద్ సీపీ... ప్రత్యేక బృందాలతో విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు.
అర్ధరాత్రి 10 నుంచి12 గంటల మధ్యలో ఈ ఘటన జరిగినట్లు అనుకుంటున్నాము. హార్వస్టర్ మెకానిక్‌గా పనిచేసే పంజాబ్‌కు చెందిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు హత్యకు గురయ్యారు. సుత్తితో కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు షెడ్‌లోపల, ఒకరు బయట హత్యచేయబడ్డారు. ఒకరిద్దరు వచ్చినట్లు తెలిసింది.. వారి గురించి వివరాలు సేకరిస్తున్నాం. ఘటనాస్థలిలో కొన్ని మద్యం సీసాలు లభించాయి. అందరూ కలిసి మద్యం సేవించారా..? అసలు ఏమిజరిగింది అనే కోణాల్లో విచారణ జరుపుతున్నాం. - కార్తికేయ, నిజామాబాద్ సీపీ
దోపిడి దొంగల పనేనా..?
కాగా... మృతులకు సంబంధించిన మొబైల్ ఫోన్లు, డబ్బులు అపహరణకు గురవటంతో... దోపిడి దొంగలే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. పక్కనే జాతీయ రహదారి ఉండటంతో... ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి: