STUDENTS MISSING IN KRISHNA RIVER : కృష్ణమ్మ గర్భంలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణాజిల్లా యనమలకుదురు సమీపంలో శుక్రవారం సరదాగా ఈతకు దిగినవారిలో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఒక బాలుడిని మత్స్యకారుడు కాపాడగా, ఇంకొకరు ఒడ్డునే ఉండి ప్రాణాలు దక్కించుకున్నాడు. విజయవాడలో పటమట దర్శిపేటకు చెందిన మద్దాల బాలు ఇంటర్ రెండో ఏడాది, షేక్ హుస్సేన్ 9వ తరగతి, షేక్ ఖాశిం అలీ 7వ తరగతి, పిన్నింటి శ్రీను 9వ తరగతి, ఇనకొల్లు గుణశేఖర్ 9వ తరగతి చదువుతున్నారు. తోట కామేష్ పదో తరగతి, షేక్ బాజీ 8వ తరగతి చదువుతూ మానేశారు. వీరంతా స్నేహితులు. శుక్రవారం మధ్యాహ్నం యనమలకుదురు వద్ద కృష్ణానదిలో ఈత కొట్టడానికి వెళ్లడానికి వెళ్లారు. వీరిలో శ్రీను ఒడ్డునే ఉండిపోయాడు. నీరు ఎక్కువగా ఉన్న చోట ఈత కొడదామని షేక్ బాజీ చెప్పడంతో అందరూ చేతులు పట్టుకొని లోపలకు వెళ్లారు. పదడుగులు వేయగానే ఒక్కసారిగా లోతుగా ఉన్న గుంతల్లోకి జారిపోయారు. నీటి ఉరవడి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. ఒడ్డున ఉన్న శ్రీను భయాందోళనలతో పెద్దగా కేకలువేయగా స్థానిక మత్స్యకారుడు ఏడుకొండలు అక్కడకు చేరుకుని.. ఖాసింవలిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. గుణశేఖర్ (14), కామేష్ (15) మృతదేహాలు సాయంత్రం 5.30 సమయంలో లభ్యమయ్యాయి. తర్వాత ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.
మిన్నంటిన రోదనలు
బాధితులందరూ రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల వారే. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు, బంధుమిత్రులు నది వద్దకు చేరుకుని తమ చిన్నారుల ఆచూకీ తెలియక తల్లడిల్లిపోయారు. మృతదేహాలు ఒడ్డుకు చేరగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు గల్లంతయిన విద్యార్థుల తల్లితండ్రులదీ అదే పరిస్థితి.
ముమ్మరంగా సహాయక చర్యలు
విద్యార్థుల మృతి, గల్లంతుపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకునేసరికి చీకటి పడటంతో గాలింపుచర్యలు నిలిపివేయాల్సి వచ్చింది. శనివారం ఉదయం తిరిగి కొనసాగించనున్నట్లు సమాచారం. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెదేపా నాయకులు అక్కడకు చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఇవీ చదవండి: