STUDENTS MISSING : విహారయాత్ర కాస్తా విషాదయాత్ర అయిన సంఘటన బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో జరిగింది. దసరా పండుగ వేళ ఆరు కుటుంబాల్లో విషాదం నిండింది. విజయవాడకు చెందిన 8 మంది యువకులు సూర్యలంక సముద్రానికి వచ్చారు.. ఒకరు ఒడ్డున ఉండగా.. మిగిలిన ఏడుగురు సముద్రస్నానానికి దిగారు.. అలల ఉద్ధృతికి కొట్టుకుపోతుండగా స్థానికులు, మెరైన్ పోలీసులు ఒకరిని కాపాడారు.. మిగిలిన ఆరుగురు రాకాసి అలల్లో కొట్టుకుపోయారు.. మెరైన్ పోలీసులు, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.. అరుగురిలో ముగ్గురు చింతల సిద్దు, సాయిమధు, జెజ్జం అభి మృతదేహాలు నిన్న లభ్యం కాగా పంచనామా అనంతరం బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ రోజు మరొకరి మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది.. సముద్రంలో గల్లంతైన మరో ఇద్దకి కోసం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సముద్రం లోపలికి వెళ్ళటం వల్లే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయారని మెరైన్ పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులంతా విజయవాడ అజిత్సింగ్ నగర్ వారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.. మృతులు పదో తరగతి వరకు చదువుకుని క్యాటరింగ్ పనులు చేస్తున్నారని, విజయవాడ కొండపల్లిలో క్యాటరింగ్ పని ఉందని ఉదయాన్నే బయటకు వచ్చారని.. సూర్యలంకకు వచ్చినట్లు తమకు తెలియదని మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మూడు మృతదేహాలను కుటుంబసభ్యులు స్వస్థలాలకు వెళ్లారు.
సూర్యలంక సముద్రతీరంలో గజఈతగాళ్లకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని.. అసలు వద్దని అధికారులు చెప్పటంతో తీరంలో గజఈతగాళ్లు లేకపోవటంతో ప్రమాదం జరిగిందని స్థానికులంటున్నారు. ఈతగాళ్లు ఉండి ఉంటే అందరినీ కాపాడేవాళ్లని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆసుపత్రిలో సీపీఎం రాష్ట్రకార్యవర్గ సభ్యురాలు డి.రమాదేవి పరామర్శించారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ... మృతుల తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారని.. ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: