గంజాయి అక్రమ రవాణా(Ganja smuggling news) అంశంపై సీఎం కేసీఆర్ సమీక్ష అనంతరం ఆ రాష్ట్ర ఆబ్కారీ, పోలీసుశాఖలు సోదాలు విస్తృతం చేశాయి. తనిఖీల్లో రోజూ తెలంగాణ వ్యాప్తంగా భారీగా గంజాయి పట్టుబడుతోంది. ఖమ్మం జిల్లాలోని మధిర మండలం ఆత్కూరు సర్కిల్ సమీపంలో 60 కిలోల గంజాయి ఇవాళ పట్టుబడింది. ఖమ్మం జిల్లా ఆత్కూరు మీదుగా గంజాయిని ఆటోలో తరలిస్తుండగా సీజ్ చేసినట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ కుంట నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామవైపునకు మధిర-వైరా ప్రధాన రహదారిలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాల తరలింపు సమాచారంతో నిఘా ఉంచిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గంజాయి తరలిస్తున్న ఒక ఆటోతో పాటు బైక్‌ను సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
సోదాలు విస్తృతం..
రాష్ట్రంలో గంజాయిని(Ganja smuggling news) కట్టడి చేయడానికి ఆబ్కారీ, పోలీసుశాఖలు సోదాలు విస్తృతం చేశాయి. తనిఖీలలో రోజూ రాష్ట్రవ్యాప్తంగా భారీగా గంజాయి పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో నిల్వల మీద కాకుండా సరఫరా మీదనే దృష్టిపెడితే మరింత కట్టుదిట్టం చేయవచ్చని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పోలీసుశాఖ నిర్ణయానికి వచ్చింది. నిజానికి ఒకప్పుడు తెలంగాణలోనూ గంజాయి భారీగానే సాగయ్యేది. ముఖ్యంగా నారాయణ్‌ఖేడ్ సాగు, రవాణాకు ప్రధాన కేంద్రంగా ఉండేది. పూర్వ వరంగల్, ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లోనూ వేలాది ఎకరాల్లో సాగయ్యేది. పోలీసుల దాడులు పెరగడంతో సాగు బాగా తగ్గింది. అయినా.. వినియోగం మాత్రం గతం కన్నా పెరిగినట్టు పోలీస్, ఎక్సైజ్‌శాఖల అంతర్గత అధ్యయనంలో తేలింది. అత్యధికంగా ఈ పంట సాగవుతున్న ప్రాంతాల్లో ఒకటైన ఉత్తరాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు హైదరాబాద్ ప్రధాన ద్వారంగా మారిందనీ రెండు శాఖలు అంచనాకు వచ్చాయి.
వాహనాలను ముందే గుర్తించేలా..
సాధారణంగా గంజాయి కేసుల్లో ప్రమేయమున్న పాత నేరస్థుల కదలిలపై నిఘా ఉంచడంతోపాటు ఇన్ఫార్మర్లకు డబ్బులు ఇచ్చి అక్రమ రవాణా సమాచారాన్ని తెలుసుకుంటారు. తెలివిమీరిన నేరగాళ్లు అక్రమ రవాణా సమయంలో సెల్‌ఫోన్‌లు వాడటం మానేయడంతో వారి కదలికలపై పక్కా సమాచారం అందడం లేదు. ఈ క్రమంలో కేవలం సాంకేతిక సమాచారంపైనే ఆధారపడకుండా, ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను పటిష్ఠం చేయడంపై యంత్రాంగం దృష్టి సారించింది. ఏవోబీలో ప్రారంభమయ్యే అక్రమ రవాణా వాహనాల సమాచారం తెలుసుకుని తెలంగాణ సరిహద్దుల్లోకి రాగానే పట్టుకోవాలనేది అధికారుల వ్యూహం.
ఇదీ చదవండి: GUTKA CAUGHT: ధాన్యం బస్తాల మధ్య గుట్కా తరలింపు.. ఇద్దరిపై కేసు నమోదు