Police Arrested Three Persons On Dead Body Parcel Case : గతంలో ఎన్నడూ చూడని, ఎక్కడా వినని రీతిలో రోజుకో మలుపు తిరుగుతూ పూటకో సవాల్ విసురుతూ పోలీసు అధికార యంత్రాంగాన్ని ముప్పుతిప్పులు పెట్టి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను తలపిస్తూ సాగిన చెక్కపెట్టెలో మృతదేహం కేసుకు ఎట్టకేలకు పశ్చిమ గోదావరి పోలీసులు ముగింపు పలికారు. అనుమానితుడే అసలు నిందితుడిగా నిర్థారించారు. మామ ఆస్తి కోసం భార్య, సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి వదినను బెదిరించడం ద్వారా ఆస్తిని కాజేయాలన్న కుట్రతో ఈ హత్యకు పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఏమీ తెలియని, పని కోసం వచ్చిన వ్యక్తిని బలి చేసినట్లు తేల్చారు.
ప్రశాంతమైన పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాల్లో ఒక్కసారిగా కలవరపాటు. ఎప్పుడూ చూడని, ఎక్కడా వినని, కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే ఘటన నిజజీవితంలో అదీ తమ గ్రామంలో జరగడంతో ఆ గ్రామస్థులు నివ్వెరపోయారు. అప్పుడప్పుడే చీకటి పడుతుందనగా మహిళ ఇంటికి వచ్చిన పార్శిల్‌లో మృతదేహం కనిపించడం, అది కూడా పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా దుర్వాసన వస్తున్న స్థితిలో కనిపించడం చూసిన మహిళ, ఆమె తల్లిదండ్రులు ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యపోయారు.
ఇంటి స్థలానికి దరఖాస్తు : పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన ముదునూరి గంగరాజుకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె తులసికి నిడదవోలుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. కొన్ని కారణాలతో భర్త వదిలేయడంతో కుమార్తెను పోషించుకోవడం కోసం తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది. 2016లో సోదరి రేవతి, శ్రీధర్ వర్మను ప్రేమ వివాహం చేసుకోగా అప్పటి నుంచి కుటుంబంలో గొడవలు తలెత్తుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తులసి పక్కనే ఉన్న గరగపర్రు గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తన కూతురితో కలిసి నివాసం ఉంటూ భీమవరంలోని ఓ స్టీల్ పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే సొంత ఇళ్లు లేని ఆమె తల్లిదండ్రుల ఊరైన యండగండిలో నివాస స్థలానికి దరఖాస్తు చేసుకోగా స్థలం మంజూరైంది. 2021లో ఇంటి నిర్మాణం ప్రారంభించగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులు సాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తన పరిస్థితిని తెలియజేస్తూ తమ సామాజిక వర్గానికి చెందిన ఓ సేవా సంస్థకు ఆమె దరఖాస్తు చేసుకుంది.
మృతదేహంతో పాటు లేఖ : ఎప్పటి నుంచో తులసిని అడ్డు తొలగించుకోవడం ద్వారా మామ ఆస్తిని చేజిక్కించుకోవాలని చూస్తున్న శ్రీధర్ వర్మకు ఇది మంచి అవకాశంగా మారింది. తానే ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని పంపి సేవా సంస్థ ద్వారా వచ్చినట్లు తులసిని శ్రీధర్ వర్మ నమ్మించారు. మరోసారి మోటారు, విద్యుత్ పరికరాలు పంపుతున్నట్లు మహిళ చరవాణికి సమాచారం అందించాడు. అదే రోజు సాయంత్రం మహిళ ఇంటికి ఓ చెక్క పెట్టెలో పార్శిల్ రాగా విధులు ముగించుకుని తండ్రి ఇంటికి వచ్చిన తులసి పెట్టె నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించి తెరిచి చూసింది. అందులో గుర్తు తెలియని మృతదేహం ఉండటంతో భయభ్రాంతులకు గురైంది.
మృతదేహాన్ని పంపడమేగాక తక్షణం కోటిన్నర సొమ్ము చెల్లించాలంటూ బెదిరిస్తూ లేఖ పంపారు. అప్పుడు అక్కడే ఉన్న శ్రీధర్‌వర్మ ఈ డబ్బు మొత్తం చెల్లిద్దామని లేకపోతే మర్డర్ కేసులో ఇరుక్కుంటామని ఇంట్లో వారందరినీ బయపెట్టాడు. సొమ్ము తానే సర్దుబాటు చేయడంతో పాటు, మృతదేహాన్ని సైతం ఎవరికీ తెలియకుండా మాయం చేస్తానని నమ్మబలికాడు. అందరూ భయపడిపోయి తనదారికి వస్తారని శ్రీధర్‌వర్మ భావించగా తులసి పోలీసులను ఆశ్రయించడంతో పథకం బెడిసికొట్టింది. తులసి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శవం ఎక్కడిది, ఎలా వచ్చింది అనే కోణంలో విచారణ ప్రారంభించగా శ్రీధర్ వర్మే అసలు నిందితుడని పోలీసులు తేల్చారు. మచిలీపట్నం సమీపంలో శ్రీధర్ వర్మతో పాటు అతనికి సహకరించిన భార్య తులసి, సహజీవనం చేస్తున్న మహిళ సుష్మ అలియాస్ విజయలక్ష్మిని అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు.
తాడు మెడకు బిగించి హత్య : నిందితుడు శ్రీధర్ వర్మ ఈ కుట్రకు పకడ్బంధీగా వ్యూహం రచించడం చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా తమ కుటుంబంతో ఏమాత్రం సంబంధంలేని ఓ వ్యక్తిని ఎంచుకున్న వర్మ అతనికి ముందు వెనుక ఎవరూ లేరని నిర్ధారించుకుని ఈ కుట్రలో తనని పావుగా వాడుకుని బలిబశువుని చేశాడు. కాళ్ల మండలం గాంధీనగరానికి చెందిన పర్లయ్యకు వివాహం కాగా భార్యతో విడిపోయి ఒక్కడే ఉంటూ దొరికిన పని చేస్తూ, పెట్టింది తింటూ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతుంటాడని, అతనైతే ఎవరూ పట్టించుకోరని ముందుగానే పథకం రచించిన వర్మ అతడిని కూలి పనికి అని పిలిచి, సాయంత్రం మద్యం తాగించి నిర్మానుష్యం ప్రాంతానికి తీసుకువెళ్లి తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం రెండు రోజులు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకొని పరిస్థితులు తనకు అనుకూలంగా మారిన తర్వాత పార్శిల్‌లో ఉంచి యండగండి పంపినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడికి నేరచరిత్ర లేకపోయినా గతంలో పలువురిని పేర్లు మార్చి, మోసం చేసి వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు పెళ్లిళ్లు చేసుకోగా ప్రస్తుతం సుష్మ అలియాస్ విజయలక్ష్మి అనే మహిళతో సహజీవం చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడకు చెందిన విజయలక్ష్మికి గతంలో రెండు పెళ్లిళ్లు కాగా వారి నుంచి విడిపోయిన ఆమె శ్రీధర్ వర్మతో సహజీవనం చేస్తూ ఈ కుట్రలో అతనికి సహకరించినట్లు తేల్చారు.
పార్శిల్‌లో మృతదేహం - ఆ కారులో వచ్చిన మహిళ ఎవరు?
మలుపులు తిరుగుతున్న డెడ్ బాడీ పార్సిల్ 'మిస్టరీ' - మృతుడిని గుర్తించిన పోలీసులు`