POLICE SOLVED THE MURDER CASE : చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన దారిదోపిడీ, హత్య కేసును పోలీసులు ఛేదించారు. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలో దోపిడీ దొంగలు కళ్లలో కారం కొట్టి భర్తను హత్య చేసి.. భార్య వద్ద ఉన్న నగలతో ఉడాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యను దోపిడీ దొంగల పనిగా భావించిన పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేయగా అసలు విషయం తెలిసింది. ఈ హత్యలో కీలక సూత్రధారి భార్యే అని నిర్ధారణకు వచ్చారు. హత్యకు గల కారణం తెలిసి విస్తుపోయారు.
పోలీసుల కథనం ప్రకారం.. "పెనుగొలకల గ్రామానికి చెందిన అనురాధకు.. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న గంగరాజుతో పెళ్లికి ముందే వివాహేతర సంబంధం ఉంది. కొన్ని రోజులకు బత్తలాపురానికి చెందిన దామోదర్‌తో 2019లో వివాహమైంది. పెళ్లైన తర్వాత భర్తకు తెలియకుండా తన ప్రియుడికి అనురాధ నగలు ఇచ్చింది. అయితే తాజాగా అనురాధ అత్తమామలు.. ఆస్తి కొనుగోలు చేయడానికి డబ్బులు సరిపోకపోవడంతో కోడలిని నగలు అడిగారు. నగలు తన దగ్గర లేవని.. పుట్టింట్లో ఉన్నాయని.. పండుగకు వెళ్లినప్పుడు తీసుకొస్తానని చెప్పి తప్పించుకుంది. పథకం ప్రకారం మొన్న పుట్టింట్లో నోములు ముగించుకుని భర్తతో బయలుదేరిన అనురాధ.. తన ప్రియుడికి సమాచారమందించింది. అప్రమత్తమైన ప్రియుడు.. ఇటుక నెల్లూరు వద్దకు చేరుకోగానే దామోదర్‌పై దాడి చేసి కళ్లలో కారం కొట్టి హత్య చేశాడు. అనంతరం అనురాధ వద్ద ఉన్న నగలతో ఉడాయించాడు. పథకం ప్రకారం దుండగులు హత్య చేసి నగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది" అని పలమనేరు డీఎస్పీ గంగయ్య తెలిపారు. నిందితులు గంగరాజు, అనురాధలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: