Special Team for Cheddi gang: విజయవాడ శివారు ప్రాంతాల్లో జరుగుతున్న వరుస చోరీలు పోలీసులకు సవాల్ విసిరాయి. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా వారు చెడ్డీగ్యాంగ్‌గా భావించారు. అయితే ఈ దొంగతనాలు చేస్తోంది మరో ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ తరహా దొంగతనాలకు పాల్పడే గ్యాంగ్‌లు గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉంటాయని... ఐదు నుంచి ఏడుగురు సభ్యుల ముఠా విజయవాడలో అడుగుపెట్టినట్లు అనుమానిస్తున్నారు. పాలఫ్యాక్టరీ పక్కనే అపార్ట్‌మెంట్‌లో జరిగిన చోరీ ప్రాంతంలో రెండు వేలిముద్రలు, గుంటుపల్లిలోనాలుగు వేలిముద్రలను పోలీసులు సేకరించినా...పాత నిందితుల వేలిముద్రలతో అవి సరిపోవట్లేదు.
ఒకే అవతారంలో..
vijayawada theft: పాలఫ్యాక్టరీ పక్కన జరిగిన చోరీలో16 గ్రాముల బంగారం, రూ.లక్షను దొంగిలించారు. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే.. నిక్కర్లు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఆయుధాలతో, ముఖానికి ముసుగేసుకుని లోపలకు వెళ్తున్నట్టు కనిపించింది. ఆ తర్వాత గుంటుపల్లిలోని నల్లూరి అపార్ట్‌మెంట్‌లో చోరీ జరిగింది. ఇదే అవతారంలో ఉన్న కొందరు అపార్ట్‌మెంట్ లోపలకు వెళ్లగా... చప్పుడు కావడంతో వాచ్‌మెన్ విజిల్స్ వేశాడు. చుట్టుపక్కల వారంతా మేల్కొనడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ రెండు ఘటనల్లో ఒకే అవతారంలో ఉన్న వ్యక్తులు చోరీలకు దిగారు. మూడు రోజుల క్రితం పోరంకిలోని వసంతనగర్‌లో రెండు ఇళ్లలో చోరీలు జరిగాయి. ముందు రెండు చోరీల్లో ఉన్నవారే పోరంకిలోనూ చోరీకి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.
శివారు ప్రాంతాలే టార్గెట్..!
cheddi gang cc footage: నగర పరిధిలోని శాటిలైట్ రైల్వే స్టేషన్లను విజయవాడ సీపీ కాంతిరాణా స్వయంగా తనిఖీ చేశారు. శివారు ప్రాంతాల్లోని... రహదారికి సమీపంగా ఉండే ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా తమ పని పూర్తి చేసుకుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రాంతాలను ఎంపిక చేసుకునేందుకు పగటిపూట ఆటోలు, బస్సుల్లో ప్రయాణించి రెక్కీ చేయడం... రాత్రివేళ చోరీ అనంతరం అక్కడి నుంచి సులువుగా పారిపోవడానికి మార్గాలను చూసుకుంటారని అంచనా వేశారు. శీతాకాలంలో అర్ధరాత్రి సమయంలో బయటకు వచ్చేవారు చాలా తక్కువ ఉంటారని- ఇదే అదనుగా ముఖానికి మంకీ క్యాప్ పెట్టుకుని- నేరాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు.
ఆ తెగ నేర్పరి..
ఇలాంటి దొంగతనాలు చేయడంలో ఒక తెగకు చెందిన వారు నేర్పులనే అనుమానంతో ఆ దిశగా పోలీసుల విచారణ చేస్తున్నారు. వీరు రాత్రివేళ దొంగతనాలు చేయడం... పగటిపూట జనసమర్థత తక్కువగా ఉండే రైల్వేస్టేషన్లు, శివారుల్లో గుఢారాలు వేసుకుని సంచార జాతుల మాదిరిగా జీవనం సాగిస్తుంటారన్న సమాచారంతో ఆ దిశగా పోలీసులు నిఘా పెట్టారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో ముసుగు దొంగలు చోరీలపై ఇప్పటికే కొందరి అనుమానితుల ఫోటోలను సేకరించిన పోలీసులు- వారి కదలికల కోసం మరింత ప్రత్యేక నిఘా ఉంచారు. ఓ బృందాన్ని గుజరాత్ పంపారు.
నైట్ టైం కొందరు అనుమానితులు ఉన్నారని కాల్స్ వచ్చాయి. దాన్ని మేం ఫాలోఅప్ చేస్తున్నాం. రెగ్యులర్‌గా పెట్రోలింగ్ చేస్తున్నాం. 128 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి 15 వాహనాలను కేటాయించి... శివారు ప్రాంతాల్లోని విల్లాలు, అపార్టుమెంట్లలో తనిఖీలు చేస్తున్నాం. గుజరాత్‌కు పంపిన టీం ఇవాళ రీచ్ అవుతుంది. అక్కడ వాళ్ల కూడా వర్కౌట్ చేస్తున్నారు.
-కాంతిరాణా టాటా, విజయవాడ సీపీ
కొద్దిరోజుల్లోనే వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఆటకట్టిస్తామని విజయవాడ నగర పోలీసులు ప్రజలకు భరోసా ఇస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఎక్కడ ఎవరి ఎలాంటి సమాచారం లభించినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: Pawan: నేడు పవన్ కల్యాణ్ 'విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష'.. ఏర్పాట్లు పూర్తి