Degree Student Anusha Death Case: వైఎస్ఆర్ జిల్లా బద్వేలు డిగ్రీ కళాశాల విద్యార్థిని అనూష మృతికి కారణమైన గురు మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురుమహేశ్వర్ రెడ్డి, అనూష మధ్య పరిచయం ఉందని.. ఈనెల 19న ఇద్దరూ ద్విచక్ర వాహనంలో సిద్ధవటం కోటకు వెళ్లి వచ్చారని ఎస్పీ అన్బురాజన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 20వ తేదీ తన బర్త్డే కోసం కళాశాలకు వచ్చే విధంగా అనూషను ఒప్పించాలని గురు మహేశ్వర్ రెడ్డి.. అనూష సోదరిని కోరినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఈ నెల 20వ తేదీన ఉదయం బద్వేలు నుంచి బస్సులో అనూష ప్రయాణించి ఉదయం 9.45 గంటలకు సిద్ధవటం కోటకు చేరుకుందని వివరించారు. అనూష నదిలోకి తానే దూకి ఆత్మహత్య చేసుకుందా.. ఇంకా ఎవరైనా తోశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. అనూష శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమిక నివేదికలో తేలిందన్న ఎస్పీ.. మరోసారి ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత వివరాలను వెల్లడిస్తామన్నారు.
స్పందించిన వంగలపూడి అనిత: డిగ్రీ విద్యార్థిని అనూష మృతిపై పోలీసులు వివరాలు వెల్లడించడంపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. సైకో సీఎం చేతగానితనం, అసమర్థత ఆడబిడ్డలకు శాపంగా మారిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. అక్కాచెల్లెమ్మలకు అండగా ఉంటానని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ , రాష్ట్రంలోని ఆడబిడ్డల మానానికి, ప్రాణానికి ఖరీదుకట్టే దుస్థితికి వచ్చారని ఆక్షేపించారు. అక్టోబర్ 20వ తేదీనాటికి 20రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై ఈ నెలలో 20కి పైగా నేర ఘటనలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యంతో కడపలో అనూష చనిపోయిందని, పోస్టుమార్టం నివేదిక రాకుండానే ఆమెది ఆత్మహత్య అని పోలీసులు ఎలా నిర్ధారిస్తారని అనిత నిలదీశారు. జగన్ ఆర్భాటంగా చెప్పే జీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థ ఆడబిడ్డల రక్షణకు పనికిరాకుండా పోయిందని మండిపడ్డారు.
ఇవీ చదవండి: