POLICE APP: నాలుగేళ్ల కిందట కాకినాడ జిల్లా తునిలో అపహరణకు గురైన ఓ బుల్లెట్ బండిని పోలీసు యాప్ పసిగట్టింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎస్సై లక్ష్మణరావు అబీద్‌కూడలిలో శనివారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. బుల్లెట్‌పై వస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లికి చెందిన ఓ యువకుడిని ఆపి రికార్డులు అడిగారు. కొన్ని రికార్డులు లేకపోవడంతో ఈ-చలానాలోని ‘బోలో ఆప్షన్’ నొక్కారు. వెంటనే అందులోని అలారం అప్రమత్తం చేసింది. ‘ఏపీ 05 డీఆర్ 2755’ నంబరు ఉన్న బుల్లెట్ 2019లో చోరీకి గురైంది. దాని యజమాని అయిన న్యాయవాది ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదైందని సెల్‌ఫోన్ తెరపై వివరాలు కనిపించాయి. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని తుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్నేళ్ల తర్వాత యాప్ సాయంతో వాహనం పట్టుబడటంతో తుని పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. బండి ఇక దొరకదేమోనని కేసు పక్కన పెట్టేసిన పోలీసులకు ఇప్పుడు తీగ దొరకడంతో డొంక కదిలించే పనిలో పడ్డారు.
ఇవీ చదవండి: