Pigs theft: పందులు దొంగలిస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిన అతికిరాతకంగా హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం శివప్రియగనగర్లో జరిగింది. చిలకలూరిపేటకు చెందిన పరతపు కిల్లయ్య (40) పందులు కాసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. గణపవరం కుప్పగంజి వాగు సమీపంలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం వద్ద ప్రతిరోజూ వాటిని మేపుకుంటూ రాత్రికి షెడ్లో కట్టేసి ఇంటికి చేరుతుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 15న పందుల వద్దకు వెళ్లిన కిల్లయ్య ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు ఆందోళనతో గాలించగా.. ఈ నెల 16న శివప్రియనగర్ కాలువ పక్కన హత్యకు గురైనట్లు గుర్తించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. భార్య ఫిర్యాదుతో చిలకలూరిపేట గ్రామీణ సీఐ విచారణ చేపట్టారు.
పందులు దొంగలిస్తున్నాడని...
చిలకలూరిపేట భావనారుషినగర్కు చెందిన దార్ల చినకోటయ్య కూడా పందుల పోషణ చేస్తుంటాడు. ఇతని పందులు ఆరు నెలలుగా దొంగతనానికి గురవుతున్నాయి. తనకు బావ వరుసైన కిల్లయ్య పందులను దొంగతనం చేస్తున్నాడని అనుమానించాడు. అతన్ని చంపితే దొంగతనం ఆగుతుందని భావించాడు. ఏఎంజీ పక్కన ఉండే మిత్రుడు పాలపర్తి వెంకట సుబ్బారావుతో ఈ విషయాన్ని చర్చించాడు. కోటప్పకొండకు చెందిన కనకరాజును కిరాయికి మాట్లాడుకున్నారు. ముగ్గురు కలిసి కిల్లయ్య హత్యకు పథకం వేశారు. ఈనెల 15న పందులు మేపుకుంటున్న కిల్లయ్యపై దాడి చేశారు. అతి దారుణంగా కత్తులతో చంపి పరారయ్యారు.
సోదరుని సమాచారంతో...
పందులు దొంగతనం చేస్తున్నట్లు బంధువు చిన కోటయ్య తనపై నెపం వేస్తున్నాడని.. తరచూ గొడవ పెట్టుకుంటున్నాడని గతంలో కిల్లయ్య తన సోదరుడు కోటేశ్వరరావుకు చెప్పి ఆవేదన చెందాడు. మృతుని సోదరుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అనుమానితులపై నిఘా పెట్టారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో హత్యకు సహకరించిన ఇద్దరి వివరాలు తెలిపాడు. గ్రామీణ సీఐ ముగ్గురు నిందితులను గురువారం రోజు అరెస్టు చేసి చిలకలూరిపేట న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. తక్కువ సమయంలో నిందితులను అరెస్టు చేసిన ఎస్ఐ సతీష్‌తో పాటు సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
ఇదీ చదవండి:
chits cheating: చిట్టీల పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘరానా మోసం.. రూ.6 కోట్లతో పరారీ