పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ మహిళ.. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డ ఓ మాయగాడి మాటలు నమ్మింది. పుట్టిపెరిగిన ఊరుతో పాటు కట్టుకున్న భర్త, పిల్లలను వదిలేసి అతడితో విశాఖకు వచ్చేసింది. వారం రోజులపాటు అతడితో హాయిగా గడిపిన ఆమెకు భర్త, పిల్లలు గుర్తుకురావడం మొదలైంది. తన బిడ్డలను వదిలి ఉండలేనని.. తాను ఇంటికెళ్లిపోతానని అతడిని బ్రతిమాలింది. అందుకు అతడు ఒప్పుకోకపోగా... ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. తట్టుకోలేక ఆమె కట్టుబట్టలతో రోడ్డు మీదకొచ్చింది. ఏం చేయాలో పాలుపోక ఏడుస్తుంటే.. స్థానికులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆమె చెప్పేది అర్థం కాకపోవడంతో.. పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగన పోలీసులు కేజీహెచ్‌లోని వన్ స్టాప్ సెంటర్లో ఆమెకు ఆశ్రయం కల్పించారు.
కోల్‌కతాకు చెందిన ఈ మహిళకు.. భర్త ఇద్దరు పిల్లలున్నారు. ఆమె కుటుంబం కొంతకాలం క్రితం జీవనోపాధి నిమిత్తం కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. అక్కడ బాధిత మహిళకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను తన మాయమాటలతో నమ్మించాడు. ఇద్దరు కలిసి విశాఖకు వచ్చేశారు. వారం రోజులుగా విశాఖలోనే ఉన్నారు. అయితే తన పిల్లలు, కుటుంబ సభ్యులు గుర్తుకు వస్తున్నారని, తాను తిరిగి ఇంటికి వెళ్లిపోతానని చెప్పింది. దీనికి అతను నిరాకరించటంతో పాటు కొట్టాడు. దీంతో కట్టుబట్టలతో బయటకు వచ్చేసినట్లుగా పోలీసులు విచారణలో తేలింది.
ఆమె వద్ద ఫోన్ కూడా లేకపోవటం, ఆమెతో ఉన్న వ్యక్తి వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు కోల్‌కతాలోని పలు పోలీసు స్టేషన్లను సంప్రదించి ఆమె వివరాలు సేకరించారు. ప్రస్తుతానికి ఆమెను విశాఖ కేజీహెచ్‌లోని ఒన్‌స్టాప్ సెంటర్‌లో ఆశ్రయం కల్పించేందుకు పంపించారు. ఆమెను ఇంటికి పంపే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇదీ చూడండి: BOARDS MEETING: ఇవాళ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ