వాహనం ఆపమన్నందుకు విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందిపై దాడి చేశాడు ఓ వాహనదారుడు. హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూఘాట్ రామాలయం వద్ద టోలిచౌక్ ట్రాఫిక్ సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో యాక్టివా వాహనంపై వెళ్తున్న షేక్ హాజీ పాషాను పోలీసులు ఆపమన్నారు. ఈ క్రమంలో వెహికిల్ ఆపకుండా... వేగంగా తప్పించుకునే ప్రయత్నంలో హోంగార్డ్ రవిపైకి వాహనాన్ని ఎక్కించి... దాడికి చేశాడు.
గొడవను గమనించిన పాషా మిత్రులు సైతం పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఇష్టం వచ్చినట్టు రవిపై దాష్టీకానికి పాల్పడ్డారు. ఘటనను చూసిన తోటి ట్రాఫిక్ పోలీసులు ఆపడానికి ప్రయత్నించినా... సాధ్యం కాలేదు. వెంటనే లంగర్ హౌస్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.