భవానీపురానికి చెందిన యార్లగడ్డ డేవిడ్ విజయవాడలో ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కంకిపాడు ప్రాంతానికి చెందిన ఒక యువతితో రెండేళ్ల కిందట అతడికి ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. సదరు యువతి సోమవారం సాయంత్రం యువకుడికి ఫోన్ చేసి తాను మైలవరం మండలం పుల్లూరులోని తన మామయ్య వాళ్ల ఇంటి వద్ద ఉన్నానని, రాత్రికి గుంటూరులో పెళ్లికి వెళ్లాల్సి ఉన్నందున తనను తీసుకెళ్లాలని కోరింది.
రాత్రి 9 గంటల సమయంలో కారులో పుల్లూరు చేరుకున్న అతను, ఆమెకు ఫోన్ చేసి చిరునామా అడగ్గా, తన సోదరుడు వచ్చి తీసుకొస్తాడని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత యువతి సోదరుడు, మరో వ్యక్తి వచ్చి కారులో అతడ్ని జమలాపురం మార్గానికి తీసుకెళ్తూ దారిలోనే బ్లేడుతో అతని మెడ, చేతులు కోశారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడ్ని అదే కారులో తీసుకుని జి.కొండూరు మండలం కవులూరు, శాంతినగర్ మధ్య మార్గంలోని బుడమేరు కాలువలో పడేశారు. అతని ఫోన్, ఉంగరాలు లాక్కొని పరారయ్యారు. కారును జి.కొండూరు, చెవుటూరు గ్రామాల మధ్య జాతీయ రహదారి బైపాస్‌లో వదిలేశారు. అదృష్టవశాత్తు కాలువలో బాధిత యువకుడికి దుంగ దొరకడంతో ఎలాగొలా ఒడ్డుకు వచ్చాడు. అంతలో అటుగా వెళ్తున్న ఆటోను ఆపి, విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఇబ్రహీంపట్నం పోలీసుల సాయంతో విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
తాను యువతిని ప్రేమించానని, ఆమె రమ్మంటే వచ్చానని యువకుడు ఫొటోలు చూపుతుండగా, సదరు యువతి ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు నానా పాట్లు పడుతున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంపైనా అస్పష్టత నెలకొంది. సీఐ పి.శ్రీను, ఎస్సై రాంబాబు దర్యాప్తు చేస్తున్నారు.