భార్యా వియోగం ఆ తండ్రిని కుంగదీసింది. కొన్ని నెలలుగా విషాదాన్ని పంటి బిగువున భరిస్తూ వచ్చిన అతడు... తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ తనువు చాలించాడు. విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. సెక్యురిటీ గార్డుగా పని చేసే సత్యనారాయణ అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో మూత్రాసు కాలనీలో నివసించేవాడు. అరకొర ఆదాయమే అయినా ఉన్నంతలో ఆనందంగానే జీవించే ఆ కుటుంబం ఆడ దిక్కును కోల్పోవడం చిచ్చు రేపింది.
భార్య పుష్పలత గతేడాది నవంబర్లో అనారోగ్యానికి గురై మృతి చెందింది. నాటి నుంచీ కుంగుబాటుకు గురైన సత్యనారాయణ మంగళవారం రాత్రి పిల్లలు లోకేష్, తేజ శ్రీకి విషమిచ్చి అనంతరం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం వృద్ధురాలైన అత్త నూకరత్నం... విగత జీవులుగా పడివున్న అల్లుడు, పిల్లలను చూసి బోరున విలపించింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: ఏప్రిల్ 1 నుంచి ఎన్నికల బాండ్ల విక్రయాలు