ఆడశిశువు పుట్టిందన్న కారణతో ఓ తల్లి కన్న పేగు బంధాన్ని మరిచింది. పాపను ఆస్పత్రిలోనే వదిలేసి.. గుట్టుచప్పుడు కాకుండా అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ దారుణ ఘటన నంద్యాల జిల్లా డోన్‌లో చోటుచేసుకుంది. ఏడు రోజుల క్రితం పురిటి నొప్పులతో డోన్‌లోని యశోదా ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణీ.. ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ శిశువును అక్కడే వదిలేసి తల్లి, బంధువులు వెళ్లిపోయారు. ఎంతసేపటికీ శిశువు కోసం ఎవ్వరూ రాకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళ ప్రసవం కోసం వచ్చినప్పుడు గుర్తింపు ఆధారాలు సేకరించకపోవడం, ఆసుపత్రిలో సీసీ కెమెరాలు లేకపోవడంతో శిశువు తల్లిదండ్రులను పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో డాక్టర్ సుంకన్న.. ఆ పాపను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ శిశువును కర్నూలు శిశు సంక్షేమ శాఖకు తరలించారు. ఆ పాప తల్లిదండ్రులు మనసు మార్చుకొని వస్తే డీఎన్ఏ పరీక్ష అనంతరం వారికి అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం.. తల్లిదండ్రులు ఇచ్చే కాసులే చూశారు తప్ప.. వారి వివరాలు నమోదు చేసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని.. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: "ఇక్కడ పండు చెబితేనే ఏదైనా...మాతో వస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయి"