Two Doctors Died in Road Accident : విహార యాత్ర ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు వైద్యులు, ఒక లాయర్ మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, బళ్లారికి చెందిన విమ్స్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ యోగేష్, డాక్టర్ గోవిందరాయ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ అమరేష్ గౌడ, లాయర్ వెంకట నాయుడు విహారయాత్రకు బ్యాంకాంక్ వెళ్లారు. యాత్ర ముగించుకుని గత రాత్రి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో రోడ్డు మార్గంలో బళ్లారి బయలు దేరారు. తెల్లవారుజామున అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద జాతీయ రహదారిపై 42వ వీరి వాహనం ప్రమాదానికి గురైంది. పొగమంచు కారణంగా వేగంగా వెళ్తూ చెట్టును ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జయింది. ముగ్గురు మృతి చెందారు.
ప్రమాదం జరిగిన వెంటనే వైద్యుల ఐ ఫోన్ నుంచి తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాలకు కుటుంబ సభ్యులకు ప్రమాదంపై సంక్షిప్త సందేశం వెళ్లింది. జీపీఎస్ సందేశం రాగానే తమ వాళ్లు ఆపదలో ఉన్నారంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బళ్లారి నుంచి జీపీఎస్ ఆధారంగా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో భారీ వేప చెట్టు కారుపై పడటంతో కుటుంబసభ్యులకు ప్రమాదానికి గురైన వాహనం కనిపించలేదు. ఫోన్ జీపీఎస్ ఆధారంగా వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఇద్దరు వైద్యులు, ఒక లాయర్ కారులోనే చనిపోయారు. డాక్టర్ యోగేష్, డాక్టర్ గోవిందరాయ, లాయర్ వెంకట నాయుడు మృతి చెందినట్లు గుర్తించారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్ అమరగౌడను బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించారు.