తెలంగాణలో విచారణ పేరిట గిరిజన యువకుడిని చితకబాది విమర్శల పాలైన ఎస్సైపై (SI) ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్సై ఎం.లింగంను సస్పెండ్ (Suspend) చేస్తూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ (SP Rajendra prasad) ఉత్తర్వులు జారీ చేశారు.
సూర్యాపేట జిల్లా ఏపూరు గ్రామంలోని మద్యం దుకాణంలో చోటుచేసుకున్న చోరీ (Theft) ఘటనలో..సీసీ కెమెరాల ఆధారంగా నలుగురు యువకులను ఆత్మకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో వీరశేఖర్ అనే వ్యక్తి పట్ల దారుణంగా వ్యవహరించిన ఖాకీలు..అభాసుపాలయ్యారు. తీవ్రంగా హింసించడంతో యువకుడి గ్రామస్థులైన రామోజీతండా వాసులు...గురువారం ఆందోళన నిర్వహించారు. గిరిజన యువకుడిపై దాడి అంశంలో అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో..సూర్యాపేట డీఎస్పీ (DSP) విచారణాధికారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగిస్తున్న అధికారులు...ఘటనకు బాధ్యుడైన ఎస్సైని ఎం.లింగంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నారాయణ పరామర్శ
ప్రస్తుతం సూర్యాపేట మెట్రో ఆస్పత్రిలో వీరశేఖర్ చికిత్స పొందుతున్నాడు. బాధితుడిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) పరామర్శించారు. వీరశేఖర్‌ను స్టేషన్లో చిత్రహింసలకు గురిచేసిన ఆత్మకూరు పోలీసులపై కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని నారాయణ డిమాండ్ చేశారు. నారాయణ ముందు బాధితుడు గోడు వెల్లబోసుకున్నాడు. పోలీసులు మూత్రం తాగించారని బాధితుడు నారాయణ ముందు విలపించాడు.
ఇసుక దోపిడీతో రోజుకు రూ.2 కోట్ల ప్రజాధనం దోచుకుంటున్న ప్రభుత్వంలోని గజ దొంగలను పట్టుకునే దమ్ము పోలీసులకు ఉందా ? అని నారాయణ ప్రశ్నించారు. రెవెన్యూ , రిజిస్ట్రేషన్ తదితర కార్యాలయాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు రోజువారీ కమీషన్లు వస్తున్నాయని నారాయణ ఆరోపించారు. బాధితుడిని హింసించిన ఆత్మకూరు పోలీసుల తీరు జై భీమ్ సినిమాను తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు నుంచి కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా.. పోలీసులు మారడం లేదని మండిపడ్డారు. ఆత్మకూరు ఘటనపై సీబీఐ లేదా రిటైర్డు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
సూర్యపేట జిల్లా ఆత్మకూరు (atmakur police) మండలం ఏపూరులో ఐదు రోజుల క్రితం ఓ దొంగతనం జరిగింది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. ఆ దృశ్యాల్లో రామోజీ తండాకు (ramoji thanda) చెందిన ధరావత్ నవీన్ కనిపించాడు. అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. నవీన్ ఇచ్చిన సమాచారంతో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అందరినీ చావబాదారనే ఆరోపణలు ఉన్నాయి. అందులో ఓ యువకుడే ధరావత్ వీరశేఖర్. పోలీస్ దెబ్బలు (police attack) భరించలేక వీరశేఖర్ స్పృహ కోల్పోయాడు. ఏం చేయాలో పాలుపోని పోలీసులు వీర శేఖర్‌ను తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్పృహతప్పి పడిపోయి ఉన్న వీరశేఖర్‌ను చూసి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. తండా వాసులంతా స్టేషన్ ముందుకు చేరుకుని ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
క్షేత్ర స్థాయిలో విచారణ
వీరశేఖర్‌ను చేతులపై మోసుకొచ్చి తండావాసులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు సీన్‌ను ఆస్పత్రికి మార్చేశారు. వైద్యులు పరీక్షిస్తే అసలు విషయం బయటికొస్తుందని.. తామసలు కొట్టనే లేదని ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.
జై భీమ్ తరహాలో
ఇటీవల సూర్య నటించిన జై భీమ్ సినిమా (jai bhim movie) సంచలనం రేపింది. ఈ చిత్రంలో విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలు పెట్టే దృశ్యాలు అందరినీ కదిలించాయి. చేయని నేరానికి అమాయకులను కేసుల్లో ఇరికించి పోలీసులు ఎలా చావగొడతారనే కథాంశంతో వచ్చిన సినిమా చూసి చలించని వాళ్లు ఉండరు. లాకప్ డెత్ చేసి దాన్నుంచి తప్పించుకునేందుకు పోలీసులు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి దొరికిపోయిన తీరు కళ్లకు కట్టింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి:
Police attack: చితకబాదిన పోలీసులు.. స్పృహ కోల్పోయిన బాధితుడు.. స్టేషన్ ఎదుట ధర్నా