తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో ఈ నెల 19న జరిగిన హత్యల కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 గొడ్డళ్లు, ఒక కర్ర, కారం పొడి ప్యాకెట్లు, రక్తపు మరకలు గల బట్టలను స్వాధీనం చేసుకుని.. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు.
ఇదీ జరిగింది..
గంగారం గ్రామంలో అన్నదమ్ముల కుటుంబాల మధ్య చెలరేగిన భూవివాదం.. ఈ ఘటనకు దారి తీసింది. తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు అతి దారుణంగా నరికి చంపారు. పొలం హద్దుల విషయంలో గత కొంత కాలంగా రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతోంది. దీనికి సంబంధించి మరోసారి మాట్లాడుకునేందుకు పొలం వద్ద... రెండు కుటుంబాలు సమావేశమయ్యారు. మాటామాటా పెరిగి గొడవ తారాస్థాయికి చేరడంతో.. మంజూ నాయక్, ఆయన కుమారులు సారయ్య, భాస్కర్‌ల కళ్లల్లో కారం చల్లి.. ప్రత్యర్థులు గొడ్డలితో దాడి చేశారు. వారు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మంజూనాయక్ మరో కుమారుడు గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్నారు.
ఇలా చిక్కారు..
నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. సోమవారం ఉదయం మహదేవ్ పూర్ శివారులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వచ్చి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు.\
సంబంధిత కథనాలు: