Tandoor theft case: దొంగతనం అంటేనే.. బంగారం.. నగదు.. విలువైన వస్తువులను ఎత్తుకెళ్తారు. అలాంటిది ఓ ఇంట్లో చొరబడిన దొంగ.. బంగారం, డబ్బు వదిలేసి.. కేవలం దుస్తులను మాత్రమే ఎత్తుకెళ్లాడు..! ఇల్లంతా చిందరవందర చేసి మరీ.. కొత్త వస్త్రాలను తీసుకెళ్లాడు.
తెలంగాణ రాష్ట్రం తాండూరు పట్టణం కొడంగల్ రోడ్డు మార్గంలోని రైల్వే వంతెన పక్కన ఉన్న కాలనీలో మోనాచారి.. భార్య, కుమారులతో నివాసం ఉంటున్నారు. బంధువుల్లో ఒకరు ఆస్పత్రిలో ఉన్నారని ఇంటికి తాళం వేసి పరిగికి వెళ్లారు. పది రోజులుగా అక్కడే ఉన్నారు.
ఈ విషయం పసిగట్టిన దొంగ శుక్రవారం రాత్రి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డాడు. సామగ్రి అంతా చిందరవందర చేశాడు. బీరువాలో 6 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు, దుస్తులు ఉన్నాయి.
ఇటీవలే కుమారుడి వివాహం కావడంతో కొత్తదుస్తులే ఎక్కువగా ఉన్నాయి. ఇల్లంతా తిరిగిన ఆ దొంగ.. బంగారం, వెండి ఆభరణాలను వదిలేసి కేవలం కొత్త ప్యాంట్లు, షర్టులు, చీరలు, ఇతర వస్త్రాలను మాత్రమే మూటగట్టుకొని వెళ్లిపోయాడు. శనివారం ఉదయం విషయం తెలుసుకున్న ఇంటి యజమానురాలు హైమావతి వచ్చి... దొంగతనం జరిగిందని గ్రహించి కాలనీవాసుల సహకారంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వచ్చిన తరువాత ఇంటి తలుపులు తీసి చూశారు. బంగారం, వెండి భద్రంగానే ఉన్నాయని.. కేవలం దుస్తులు మాత్రమే పోయాయని చెబుతూ ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడికైనా ఊరెళితే తమకు సమాచారం ఇవ్వాలని.. నిఘా పెడతామని కాలనీవాసులకు పోలీసులు సూచించారు.
ఇదీ చదవండి: మద్యం మత్తులో వైకాపా నాయకుల వీరంగం.. పోలీసులపైనే...