SI Suspension: కృష్ణా జిల్లా రేపూడితండా వాసి బాలాజీ ఆత్మహత్య ఘటనలో ఎ.కొండూరు ఎస్సై టి.శ్రీనివాస్‌ను ఎస్పీ సస్పెండ్ చేశారు. నాటుసారా కేసు విచారణ పేరుతో ఎస్సై కొట్టడం వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడన్ని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ కేసుకి సంబంధించి మైలవరం సీఐ ఎల్.రమేశ్‌పైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే...
కృష్ణా జిల్లా ఏ. కొండూరు మండలం రేపూడితండాకు చెందిన లకావతు బాలాజీ(69) పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స నిమిత్తం విస్సన్నపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. నాటుసారా విక్రయిస్తున్నాడనే అనుమానంతో పోలీసులు సోమవారం రాత్రి అతనిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్సై టి. శ్రీనివాస్ విచక్షణా రహితంగా కొట్టాడని, దీంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బాలాజీ కుమారులు ఆరోపించారు.
రేపూడితండాలో ఇంటి వద్దనే మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. ఎస్సై టి. శ్రీనివాస్‌ని సస్పెండ్ చేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే.. మృతుని కుటుంబ సభ్యులతో నూజివీడు డీఎస్పీ బి. శ్రీనివాసులు మంతనాలు జరిపారు. రాజీ దిశగా పలు దఫాలుగా చర్చించారు.
గతంలోనూ ఇదే విధంగా ఎస్సై కొట్టడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై టి. శ్రీనివాస్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సైను కాపాడేందుకు అధికారుల ప్రయత్నం చేస్తున్నట్లు స్థానికులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. తిరువూరు సర్కిల్ కార్యాలయం వద్ద పోలీసులపై మృతుని కుటుంబసభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుని ప్రాణాలకు విలువ కడతారా? అని మండిపడ్డారు.
ఇదీ చదవండి: నాటుసారా మరణాలపై నిలదీస్తే.. సభ నుంచి సస్పెండ్ చేశారు -తెదేపా