విశాఖ జిల్లాలోని నగర పరిధిలో ఆక్రమణలు, ఫ్లెక్సీల తొలగింపు విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల మాటకు విలువ లేకుండాపోయిందని కొంతమంది ఎమ్మెల్యేలు, నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ, భూముల పరిరక్షణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశం వాడివేడిగా సాగింది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మాధవి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అధికారపక్ష ఎమ్మెల్యేలు వివిధాంశాలను లేవనెత్తారు. పెందుర్తి మండలంలో సర్వే సంఖ్య 91లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని అధికారులకు ఫిర్యాదు చేస్తే.. అవతలి వ్యక్తి హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొనే వరకు రెవెన్యూ అధికారులు కదలకపోవటం ఎంతవరకు సబబని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ప్రశ్నించినట్లు సమాచారం. ఇలా అయితే ప్రభుత్వభూములను ఎలా కాపాడుకుంటామని అధికారులను ప్రశ్నించారు.
ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ.. అచ్యుతాపురం మండలంలో భూమి ఆక్రమణకు గురైందని చెబితే.. పక్క జిల్లా మంత్రి ఒకరు జోక్యం చేసుకుని అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు ఎంపీ విజయసాయిరెడ్డి పేరు చెప్పి అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారని, దీనివల్ల ఆక్రమణల తొలగింపునకు అవరోధం ఏర్పడుతోందన్నారు. విజయసాయిరెడ్డికి చెడ్డ పేరు వచ్చేలా కొంతమంది ప్రవర్తిస్తున్నారని, అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు సూచించారు. నగరంలో ఫ్లెక్సీలను తొలగించాలని జీవీఎంసీ అధికారులను కోరితే, పక్క జిల్లా మంత్రి అడ్డుకోవడం ఎంతవరకు సబబని మరో ప్రజాప్రతినిధి ప్రశ్నించారు. దీంతో వీరందరికీ మంత్రులు సర్దిచెప్పాల్సి వచ్చింది. తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ పరిధిలో ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. రహదారి పనులను ప్రారంభించేందుకు వెళ్తే అడ్డుకున్నారని, అదే రోడ్డు పనులకు లోగడ సీఎం శంకుస్థాపన చేశారని చెప్పారు. ఆ పనులకే మళ్లీ మంత్రి శ్రీనివాసరావు ఎలా శంకుస్థాపన చేస్తారని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ పేదలకు తమ స్వస్థలాలకు దగ్గర్లోనే స్థలాలను కేటాయించాలని కోరారు.
*అనంతరం ఇన్‌ఛార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అధికారులు పట్టుదలతో పని చేయాలని సూచించారు. జిల్లాలో ప్రొటోకాల్ పక్కాగా పాటించాలని, వివాదాల్లేకుండా నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. తహసీల్దార్లు, కలెక్టరేట్‌లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని చెప్పారు. ప్రభుత్వ భూ దస్త్రాలను ట్యాంపరింగ్ చేసిన అధికారులపై చర్యలను తీసుకోవాలన్నారు. పర్యాటక శాఖ మంత్రి ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతీవారం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల స్వాధీన పురోగతి తెలియజేయాలన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రైవేటు సంస్థలకు కేటాయించిన ప్రభుత్వ భూములతో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ భూములను కబ్జా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వి.వినయ్‌చంద్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, వాటిని 90 రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. కోర్టుల్లో ఉన్న వివాదాస్పద భూముల వివరాలను తెలియజేయాలన్నారు. ఏపీఐఐసీ భూములను ఆక్రమిస్తున్నారని, క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయాలన్నారు. సమీక్షలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, శాసనసభ్యులు గుడివాడ అమర్‌నాథ్, తిప్పల నాగిరెడ్డి, కె.భాగ్యలక్ష్మి, శెట్టి ఫాల్గుణ, పి.ఉమాశంకర్, జేసీలు వేణుగోపాల్‌రెడ్డి, అరుణ్‌బాబు, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ కమిషనర్లు సృజన, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు లీగల్ సెల్
విశాఖలో భూముల విలువ పెరుగుతుండడంతో కొంతమంది ఏదోలా సమస్యలు సృష్టించి ప్రభుత్వ భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చూస్తున్నారు. వాటిని అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని ఎంపీ విజయసాయిరెడ్డి ఇదివరకే ప్రకటించగా.. ఆయనపై కొంతమంది ఎదురుదాడికి దిగుతున్నారు. ఒక్క విశాఖ జిల్లాలోనే 4,900 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఆక్రమణలరూపంలో, కోర్టు వివాదాల్లో ఉన్నాయి. వీటిని తిరిగి ప్రభుత్వ ఆదీనంలోకి తేవడానికి ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించాం.
*ప్రభుత్వ భూములను గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తాం. ఇదివరకు ఎవరికి ఎందుకు భూములు కేటాయించారు? వాటిని సద్వినియోగం చేశారా? ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారా.. గుర్తించి వారిపైనా చర్యలు తీసుకోవాలి. జిల్లాలో మొత్తం భూములపై ల్యాండ్ ఆడిట్ జరిపించి, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించాలి. ఇళ్ల పట్టా పంపిణీ పూర్తయ్యాక రెవెన్యూ దస్త్రాల స్వచ్ఛీకరణ చేపట్టాలి. గాజువాక ప్రాంతంలో కొన్ని చెరువులు అన్యాక్రాంతమయ్యాయని ఎమ్మెల్యే చెబుతున్నారు. వాటిని గుర్తించి జీవీఎంసీ ద్వారా చెరువుల గట్లపై సుందరీకరణపనులు చేపట్టాలి. తరువాత సమావేశంలో పంచ గ్రామాల సమస్య, గాజువాక భూములపై నియమించిన ఉపకమిటీ నివేదికలపైనా చర్చిస్తాం.
జిల్లావ్యాప్తంగా జులై 8న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం. వీఎంఆర్డీఏ పరిధిలో కొంతమంది కోర్టుకెళ్లడంతో అలాంటిచోట్ల జాప్యం జరగొచ్ఛు వీటిని త్వరగా పరిష్కరించి లబ్ధిదారులకు పట్టాలందించేలా చూడాలని కలెక్టరుకు సూచించాం. ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోని వారుంటే గ్రామ/వార్డు సచివాలయాల్లో మరలా దరఖాస్తు చేయవచ్ఛు అర్హులైతే 90 రోజుల్లో లబ్ధిదారునికి ఇంటి స్థలం అందించేలా చర్యలు తీసుకుంటాం. - జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు.
ఇదీ చదవండి :