కొన్ని దశాబ్దాలుగా వస్తున్న వాతావరణ మార్పులతో రుతువుల గతులు మారుతున్నాయి. భారత్‌లోనూ అదే దుస్థితి కనిపిస్తోంది. వీటిని మార్చేందుకు పరిశోధనలు జరగాలన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ప్రధానంగా ఉష్టోగ్రతలు పెరగడానికి ఎల్‌నినో ప్రభావం ఏ రకంగా ఉందనే అధ్యయనం మరింతగా సాగాలి. విశాఖలో ట్రోపోమెట్-2019 పేరిట భారత మెటిరియలాజికల్ సొసైటీ 5 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణులతో ఈ అంశాలపైనే చర్చించింది. కొత్త ప్రతిపాదనలు, పరిశోధనల ఫలితాలు తెలియజెప్పేందుకు ఈ సమావేశం వేదికైంది.
వాతావరణ అంచనాలకు సంబంధించి... ఇప్పుడున్న 12 కిలోమీటర్ల పరిధి వాతావరణ అంచనా మోడల్ వల్ల ప్రయోజనం లేదని ఒక అభిప్రాయం. దీన్ని పరిగణనలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ 5 కిలోమీటర్ల పరిధిలో అంచనా మోడల్ రూపొందిస్తోంది. దాదాపు వెయ్యికిపైగా డివిజన్లలో ఈ మోడల్ అందుబాటులోకి తెచ్చింది. ఇంకా 6వేల పైచిలుకు డివిజన్లకు విస్తరించాల్సి ఉంది. 2024 నాటికల్లా ఈతరహా మోడల్ ద్వారా రైతులకు కచ్చిత సమాచారం ఇవ్వగలుగుతామని ఆ శాఖ భావిస్తోంది.
ముంబై, చెన్నై వంటి మహానగరాలకు ఎదురయ్యే వరద ముప్పు... మిగిలిన మహానగరాలకూ పొంచి ఉంది. వీటి అంచనా కోసం ప్రత్యేక అధ్యయనాలు అవసరమవుతున్నాయి. భారత వాతావరణ శాఖ ఈ 2 నగరాల్లోనూ ముందస్తు హెచ్చరిక కేంద్రం, ఆధునిక సాంకేతిక కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది.
రాత్రి ఉష్టోగ్రతలు పెరగడం, గ్లోబల్ వార్మింగ్, నీటి ఆవిరి శాతంతో పడిపోతున్న భూసారం శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నాయి. మూడు వైపుల నీరు ఉన్న ప్రాంత వాతావరణ అంచనా క్లిష్టమైందంటున్నారు నిపుణులు. దీన్ని అధిగమించే దిశగా సాంకేతికత వినియోగించుకొని ప్రగతి సాధించాలని చూస్తున్నారు. భౌగోళికంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులు అంచనా వేస్తే... నష్టాన్ని తగ్గించి ఆర్థికంగా బలోపేతంకావచ్చని అంటున్నారు.
ఐరాస అంతర్జాతీయ అంచనాల విభాగం లెక్కల ప్రకారం... విపత్తుల కారణంగా ఏటా భారత్ రూ.60 వేల కోట్లకు పైనే కోల్పోతోంది. ఈ పరిస్థితిని ఉదహరిస్తూ ప్రపంచ దేశాలు మేల్కోవాలని సూచించింది ఐరాస. ముఖ్యంగా వరద కష్టాలు తగ్గించుకునే దిశాగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాతావరణ శాస్త్ర అధ్యయనాలు.. తుపానులు, భూకంపాలు, వరదలు వంటి అన్ని అంశాల్లోనూ రైతులకు ప్రయోజనకరంగా ఉండాలన్నది నిపుణుల అభిప్రాయం. పెరిగిపోతున్న జనాభా, కాలుష్యం, వనరుల అతి వినియోగం, అటవీ విధ్వంసం తగ్గించుకోకుంటే... రేపటి తరం ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనడంలో సందేహమే లేదంటున్నారు.
ఇవీ చదవండి: