ఏడాది వారీగా కేసులను పరిశీలిస్తే క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. గర్భిణిల్లో దాదాపు యథాతధ స్థితి కొనసాగుతోంది. ‘హెచ్‌ఐవీ బాధితులకు సంఘీభావం తెలుపుదాం...భాగస్వామ్యంతో బాధ్యతగా మెలుగుదాం’ నినాదంతో ఈ ఏడాది ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓ సర్వే ప్రకారం రాష్ట్రంలో వ్యాధి తీవ్రత 3 శాతంగా ఉంటే విశాఖ జిల్లా 0.25 శాతంతో 6వ స్థానంలో నిలిచింది. మంగళవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై ప్రత్యేక కథనం.
4,724 మందికి పింఛన్లు
క్రమ పద్ధతిలో ఔషధాలు వినియోగిస్తున్న బాధితులకు యంత్రాంగం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. జిల్లాలో 4,724 మంది పింఛన్లు పొందుతున్నారు. వీరిలో 375 మంది పిల్లలు ఉన్నారు. వివిధ పథకాల కింద 780 మంది లబ్ధి పొందుతున్నారు. హైరిస్క్ గ్రూపుల్లో సెక్స్ వర్కర్లు, థర్డ్ జెండర్లు, కొందరు లారీ డ్రైవర్లు ఉన్నారు.
జిల్లా వ్యాప్తంగా 21 పరీక్ష కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా హెచ్‌ఐవీ సమగ్ర సలహా, పరీక్షా కేంద్రాలు 21 ఉన్నాయి. సంచార కేంద్రాలు 2 ఉన్నాయి. 90 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐసీటీసీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో 14 ఐసీటీసీలు పనిచేస్తున్నాయి. రక్తసేకరణ కోసం ప్రత్యేకంగా వాహన సదుపాయం ఉంది. ఏఆర్‌టీ ప్లస్ కేంద్రాలు 1, ఏఆర్‌టీ కేంద్రాలు 4 ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో కూడా పరీక్షలు చేస్తున్నారు.
బాధితులకు ప్రత్యేక వైద్య సేవలు
ఎయిడ్స్/హెచ్‌ఐవీపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా నియంత్రించవచ్ఛు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వంతో పాటు సేవా సంస్థలు అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఫలితంగా నియంత్రణలోకి తీసుకు రాగలిగాం. హెచ్‌ఐవీ బారిన పడ్డవారికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. పోషక లోపంతో బాధపడేవారికి ప్రత్యేక వైద్య సేవలందిస్తున్నాం.
- డాక్టర్ ఎం.పవన్‌కుమార్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి
ఇదీ చదవండి: