విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రైళ్లు, విమాన సర్వీసుల తాత్కాలిక నిలుపుదలపై జిల్లా యంత్రాంగం ఆలోచిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి విశాఖకు వచ్చిన వారిలో 40 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. వీరిలో పాతిక మందికి పైగా దిల్లీ నుంచి వచ్చినవారే కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆదివారం వెలుగుచూసిన 25 కేసుల్లో 15 వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. వీరిలో దిల్లీ నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు.
దిల్లీ నుంచి విమానాలు, రైళ్ల ద్వారా వచ్చే వారిని నేరుగా క్వారంటైన్‌కు పంపుతున్నారు. కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని కొన్ని రోజులపాటు అక్కడినుంచి రైళ్లు, విమానాలు విశాఖకు రాకుండా చర్యలు తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయని యంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి జిల్లా యంత్రాంగం లేఖ రాయనుంది. ఆదివారం కలెక్టర్ వినయ్‌చంద్ అధికారులతో దీనిపై చర్చించినట్లు సమాచారం.
ఇదీ చదవండి : విశాఖ గ్యాస్ లీకేజీ : పరిహారం కోసం పడిగాపులు