Oil Siege: రాష్ట్రంలో విజిలెన్స్ అధికారులు వంట నూనెల దుకాణాలపై దాడులు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, విశాఖ జిల్లా గాజువాకలో దాడులు చేశారు.
కర్నూలులో...
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వంట నూనెలు దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో వంట నూనెలు నిర్ణీత ధర కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలకు జరిమానా విధిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
శ్రీకాకుళంలో...
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఓ ఆయిల్ రీఫిల్లింగ్ సంస్థపై దాడులు చేశారు. విజిలెన్స్ ఎస్పీ వరదరాజులు, రెవెన్యూ, తూనికలు కొలతల శాఖా ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. పరిమితికి మించి 25 టన్నుల వంట నూనె నిల్వలు ఉన్నట్టు గుర్తించామని విజిలెన్స్ ఎస్పీ వరదరాజులు తెలిపారు. వంటనూనె ప్యాకెట్లపై ధరల పట్టిక చెరిపివేయడం (ట్యాంపరింగ్) చేసినట్టు గుర్తించామని, 25 టన్నుల వంట నూనెను సీజ్ చేసినట్లు తెలిపారు.
విశాఖపట్టణంలో..
అక్రమ వంటనూనె నిల్వలు కలిగివున్న వ్యాపారస్తులపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కొరడా జులిపించారు . గాజువాక కణితి రోడ్డులో షాపులు, గోదాముల వద్ద అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గాయత్రి ట్రేడర్స్ వద్ద అనధికారికంగా నిల్వ ఉంచిన 60 టన్నుల వంటనూనెను గుర్తించారు. అలాగే అధిక రేట్లు ముద్రించిన స్టిక్కర్లను గుర్తించి, వంటనూనెల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. షాప్ నిర్వహకులపై క్రిమినల్ కేస్ నమోదు చేయనున్నట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ జి. స్వరూపరాణి తెలిపారు. ఈ సోదాల్లో విజిలెన్స్ సిబ్బందితో పాటుగా సివిల్ సప్లై అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు.
ఇదీ చదవండి: నంద్యాలలో విద్యార్థులకు అస్వస్థతపై.. మంత్రి సురేశ్ ఆరా