ప్రమాదం జరగటానికి ఆస్కారం ఉన్న పరిశ్రమలు రాష్ట్రంలో 86 ఉన్నాయని పరిశ్రమల శాఖ గుర్తించింది. ఆయా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అధికారులు స్వయంగా పరిశీలించిన తర్వాతే పునఃప్రారంభానికి అనుమతించనున్నారు. విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో దుర్ఘటన తర్వాత ఈ జాబితా రూపొందించింది. ప్రమాదం జరగటానికి ఆస్కారం ఉన్న పరిశ్రమల జాబితాలో ఫార్మా, గ్యాస్, రసాయనాలు తయారు చేసే భారీ పరిశ్రమలను చేర్చింది. జిల్లాల వారీగా ఆ పరిశ్రమల్లో యంత్రాలు, బాయిలర్లు, రసాయనాలు నిల్వ చేసే ట్యాంకుల వద్ద భద్రతా ప్రమాణాలు పరిశీలించి, రెండు రోజుల్లో నివేదిక పంపాలని పరిశ్రమల శాఖ ఆదేశించింది. కంపెనీ భద్రతా విభాగం అధికారులతో కలిసి పరిశ్రమల శాఖ, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పోలీసుశాఖ తరఫున సభ్యులు వెళ్లి తనిఖీలు ప్రారంభించారు. వీరు పరిశ్రమల యాజమాన్యం నుంచి భద్రతా ప్రమాణాలు పాటించినట్లు కచ్చితమైన హామీ పత్రాన్ని తీసుకోవాలి.
రెండు రోజుల్లో పరిశీలన
భారీ పరిశ్రమల భద్రతా ప్రమాణాలు పరిశీలించాకే పునఃప్రారంభానికి అనుమతించాలని ఆదేశించామని పరిశ్రమలశాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. రెండు రోజుల్లో పరిశీలన పూర్తి చేయాలని జిల్లాల అధికారులకు సూచించామన్నారు.
ఇవీ చదవండి...హానికారక పరిశ్రమలు ఊరికి దూరంగా : సీఎం జగన్