విశాఖ ఉక్కు నిర్వాసితులు గర్జించారు. మధ్యాహ్నం మండుటెండలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. వారికి మద్దతుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ర్యాలీలో ప్రైవేటీకరణ వద్దని నినదించారు. కలెక్టర్ అందుబాటులోకి రానందున జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు
విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఉద్యమకారులు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. పరిశ్రమ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులు పెద్దసంఖ్యలో రోడ్డెక్కారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సరస్వతి పార్కు నుంచి ర్యాలీగా వెళ్లిన నిర్వాసితులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఫలితంగా కలెక్టరేట్‌కు వచ్చే అన్ని మార్గాల్లో చాలాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు పరిమిత సంఖ్యలో నేతల్ని అనుమతిస్తామని చెప్పడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. చివరికి కలెక్టర్ లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసిన కార్మిక నేతలు నిర్వాసితులు వినతి పత్రాన్ని ఇచ్చారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం సమంజసం కాదంటూ నిర్వాసితులు నినదించారు. ఆ ఆలోచనను తక్షణం విరమించుకోవాలన్నారు. శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ నిర్వాసితులు చేశారు. లేనిపక్షంలో మిగిలిన 10 వేల ఎకరాల భూమిని ఇచ్చేయాలన్నారు. ఇకపై జరిగే ఉద్యమం మరింత ఉద్ధృతంగా వుంటుందని గట్టిగా చెబుతున్నారు. కార్మికులు నిర్వాసితులతో ప్రత్యేక సమావేశాన్ని కలెక్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఉక్కు కర్మాగారం విషయంలో ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టమైన తీర్మానం చేసి.. అఖిలపక్షంతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కోసం త్యాగాలు చేసిన వారు మర్యాదపూర్వకంగా జీవించే అవకాశం కల్పించాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు.
దేశానికి తలమానికమైన విశాఖ ఉక్కు కర్మాగారాన్నిఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఉద్యమకారులు హెచ్చరించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చదవండి: కృష్ణా నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన