ప్రపంచవ్యాప్తంగా 145 దేశాలను హడలెత్తిస్తున్న కరోనా.... రాష్ట్రానికి సైతం పాకింది. శనివారం ఉదయానికి 14 అనుమానిత కేసులు ఉండగా.... రాత్రి 8 గంటలకు కొత్తగా మరో 7 కేసులు నమోదయ్యాయి. అనుమానిత లక్షణాలతో విశాఖలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో 9 మంది, నెల్లూరులో ఐదుగురు, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నెల్లూరులోని ఐదుగురిలో ఒకరికి వైరస్ సోకిందని నిర్ధరణ అయింది. మొత్తం 70 మంది నమూనాలను పరీక్షలకు పంపంగా.... వారిలో 57 మందికి నెగటివ్ అని వచ్చింది. మిగతా 12 మంది నివేదికల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. వీటి నివేదికలు ఈ రాత్రికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. విజయవాడ సిద్దార్ధ కళాశాలలో నమూనాల పరీక్షలు ప్రారంభమవ్వగా.... ఇక్కడ పరీక్షించిన ఐదుగురి నమూనాలను పుణెకు పంపారు. అక్కడ వారు సంతృప్తి వ్యక్తంచేసిన తర్వత ఫలితాలను ప్రకటించనున్నారు.
విదేశాల నుంచి 3వేల మందికి పైగా...
ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుంచి రాష్ట్రానికి 3 వేలమందికి పైగా వచ్చినట్లు సమాచారం. వీరిలో కేవలం 675 మంది సమచారం మాత్రమే వైద్య అధికారుల వద్ద ఉంది. వీరిలో 428 గృహాల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రత్యేకంగా గుంటూరు జిల్లాకు 426 మంది వచ్చారని గుర్తించిన వైద్య ఆరోగ్యశాఖ.... ఎక్కువ మంది గుంటూరు, తెనాలి డివిజన్లకు చెందిన వారున్నట్లు పేర్కొన్నారు. వైద్య సిబ్బంది వారి వద్దకు వెళ్లి ఆరా తీయగా.... వారిలో ఎవరికి అనుమానిత లక్షణాలు లేవని తేలాయి. అయితే 14 రోజుల పాటు ఏకాంతగా ఉండాలని, ఎవరినీ కలవొద్దని వారికి సూచించారు. నిత్యం వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేయనున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ప్రైవేటు ఆస్పత్రుల్లోని 5 ప్రత్యేక గదులు, పది పడకల వంతున అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ నేడు సమీక్ష జరపనున్నారు. తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులు, వైరస్ నిరోధానికి రాష్ట్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భేటీలో చర్చించనున్నారు.