విశాఖపట్నం ముఖ ద్వారమైన హనుమంతవాక కూడలి వద్ద... రంగుల భవనాలు నగరవాసులను, సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. స్థానిక కొండపై ఉన్న భవనాలను వివిధ రంగులతో అలంకరించారు విశాఖ రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ బృందం. విదేశాల్లోని గృహాలను తలపించే విధంగా... విశాఖలో కొండపైనున్న 68 ఇళ్లను విభిన్న రంగులతో నింపేశారు. స్మార్ట్ సిటీగా పేరొందిన విశాఖకు అదనపు హంగులు ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేసింది రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ బృందం.
నిత్యం లక్షలాది జనాలు తిరిగే ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా... మధ్య తరగతి కుటుంబాల వారి ఇంటికి పెయింట్ వేసి ఆర్థికంగా మేలు చేశారు. ఎక్కడా నాణ్యతలో లోటులేకుండా ఖరీదైన రంగులను వినియోగించారు. హనుమంతవాకతో పాటు మరికొన్ని జంక్షన్లను ఎంపిక చేసి అక్కడ కూడా ఇలాగే ఇళ్లకు పెయింటింగ్ వేయడానికి స్వచ్ఛంద సంస్థలు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల విశాఖ మరింత అందంగా కనిపిస్తుందంటున్నారు.