విశాఖ మన్యం పాడేరు మండలం బరిసింగి గ్రామంలో నిండు గర్భిణీ అరుణ. జీవన పోరాటంలో ప్రతిరోజు కష్టపడితే గానీ పూట గడవని పరిస్థితి. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో బంతిపూల బుట్టలను మోస్తూ... వచ్చిన డబ్బులతో కాలం వెళ్లదీస్తోంది అరుణ. 15 కిలోల బరువుతో ప్రతిరోజు 5 కిలోమీటర్ల నడక ప్రయాణం చేస్తోంది.
అరుణ కష్టాలను 'ఈటీవీభారత్' వెలుగులోకి తీసుకొచ్చింది. అధికారులు స్పందించారు. ఐసీడీఎస్, మహిళా కమిషన్ సభ్యులు పరామర్శించటమే కాదు... అన్ని విధాలుగా అందుకుంటామని హామీఇచ్చారు. అరుణకు సీమంతం కూడా చేశారు. కానీ ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఆమె ప్రసవం తేదీ నాటికి కనీసం వాహన సదుపాయం కూడా కల్పించలేకపోయారు.
వాహన సదుపాయం లేకనే..!
ఈనెల 22న ఆసుపత్రికి వెళ్లిన అరుణకు స్కానింగ్ తీసి... ప్రసవం తేదీ 26 అని చెప్పారు. అరుణ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రభుత్వ అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కానీ రహదారి మార్గం సరిగా లేని కారణంగా అంబులెన్స్ రాలేదు. ఈ పరిస్థితుల్లో 8 నెలలు గర్భిణీగా ఉన్న అరుణ... రాళ్లు తేలిన రహదారిపై నడుస్తూ ఆసుపత్రికి చేరింది.
రక్తం తక్కవగా ఉందన్న వైద్యులు..!
అరుణకు పరీక్షలు చేసిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం అరుణ పాడేరు జిల్లా ఆసుపత్రి... ప్రసూతి విభాగంలో చికిత్స పొందుతోంది. కనీసం రవాణా సౌకర్యం లేకపోవటంపై కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : 8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!