విశాఖపట్నంలో సరఫరా చేస్తున్న తాగు నీటి నాణ్యతపై సమగ్ర వివరాలతో తాజా నివేదికలు సమర్పించాలని విశాఖ మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ‘‘వాటర్ పొల్యూషన్: విల్ వైజాగ్ బీ అనదర్ ఏలూరు?’’ శీర్షికన ఓ ఆంగ్ల ఈ-మేగజీన్‌లో గతేడాది డిసెంబరులో ప్రచురితమైన కథనాన్ని ఎన్జీటీ చెన్నై బెంచ్ సుమోటోగా స్వీకరించింది. గత విచారణల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు దీనిపై కమిటీలు అవసరం లేదని, నీటి నాణ్యత అంశాలపై సమగ్ర నివేదిక కోరుతూ రాష్ట్ర ప్రభుత్వమే కమిటీ వేసిందని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు.
ఆ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్జీటీకి సమర్పించారు. ఆ నివేదికపై జస్టిస్ కె.రామకృష్ణన్, విషయ నిపుణుడు డాక్టర్ కె.సత్యగోపాల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. లిఖితపూర్వక ఉత్తర్వులను బుధవారం విడుదల చేశారు. గతంలో సమర్పించిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే అంశంపై పలు కేసులు ఎన్జీటీ ప్రధాన ధర్మాసనంలో నమోదయ్యాయని, ప్రధాన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసిందని నివేదికలో తెలిపారే తప్ప వాటి అమలును పేర్కొనలేదని తెలిపింది.
* జీవీఎంసీ నీటి సరఫరాకు మూలమైన మేహాద్రి గెడ్డ, రైవాడ, తాటిపూడి, గంభీరం గెడ్డ జలాశయాల సమీపంలో కాలుష్యకారక పరిశ్రమలున్నాయా..?ఆ పరిశ్రమల నుంచి వ్యర్ధ జలాలు రాకుండా తీసుకున్న చర్యలు, ఆయా పరిశ్రమల నుంచి వెలువడే జలాలు నిర్దేశించిన నాణ్యతలో ఉన్నాయా..? అనేది నివేదికలో పేర్కొనలేదని ధర్మాసనం పేర్కొంది. జలాశయాల్లో మేజర్ డ్రైన్లు కలిసే ప్రదేశంలో నమూనాలు సేకరణ లేదని, అక్కడ నీటి నాణ్యత నిర్ధారణ వివరాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది. వారిచ్చిన నివేదికలో బయోస్సయ్ పరీక్ష ప్రకారం నీరు తాగే ముందు శుద్ధి చేయాల్సి ఉందని, అలానే తాగితే ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారని ధర్మాసనం తెలియజేసింది.
* ఈ నేపథ్యంలో గతంలో ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం ఏ ఆదేశాలు ఇచ్చింది.. వాటిని అమలు స్థితి ఏమిటి.? గత నివేదికలో విశ్లేషించకుండా వదిలేసిన అంశాలపై వివరణలతో తాజా నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఈ నివేదికలను జులై 28వ తేదీలోపు సమర్పించాలని, కేసు తదుపరి విచారణను జులై 28వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: