విశాఖ తీరంలో మురుగు నీటి సమస్య... తూర్పు నౌకాదళ కార్యకలాపాలకు ఆటంకంగా మారుతోంది. నౌకాదళ జెట్టీల నుంచి సముద్రంలోకి నిత్యం యుద్ధనౌకలు, జలాంతర్గాములు, వెళుతుంటాయి. వీటితో పాటు చిన్న తరహా నౌకలు ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు వీటి చుట్టూ పేరుకుంటున్న ప్లాస్టిక్ వ్యర్థాలు.. సమస్యలు సృష్టిస్తున్నాయి. సముద్రంలో కలుస్తున్న రసాయనాలు ఇబ్బందులు పెంచుతున్నాయి. వ్యర్థాలతో తలెత్తుతున్న ఇబ్బందులు చాలా ఏళ్లుగా ఉన్నవే అయినా.. తీవ్రత అంతకంతకూ ఎక్కువ అవుతోందని నౌకాదళ అధికారులు జీవీఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి తెచ్చారు. కొన్నిసందర్భాల్లో సముద్రంలోకి వెళ్లిన సబ్ మెరైన్ల టర్బైన్లకు.. ప్లాస్టిక్ చిక్కుకుంటున్న కారణంగా వెనక్కు తిరిగి వస్తున్నాయని అధికారులు చెప్పారు.
పోర్టు, నౌకాదళం నౌకలు రాకపోకలు సాగించే మార్గంలోని గెడ్డల వద్ద వందల టన్నుల చెత్తు ప్రతి రోజు పేరుకుంటోంది. ఇందులో ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. వీటిని అడ్డుకునేందుకు జీవీఎంసీ అధికారులు ప్రత్యేకంగా గ్రిల్స్, వలలు ఏర్పాటు చేశారు. వాటి వద్ద పేరుకునే వ్యర్థాలను క్రేన్ల ద్వారా తొలగిస్తున్నారు. రసాయనాలు సముద్ర జలాల్లోకి కలుస్తున్న సమస్యను మాత్రం కాలుష్య నియంత్రణ మండలి పరిష్కరించాల్సి ఉంది.
ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రజల్లో అవగాహన పెరగాలి. మురుగు నీరు ప్రవహించే గెడ్డల్లో ప్రజలు నేరుగా వ్యర్థాలను పడేస్తుండడం సమస్యకు కారణం అవుతోంది. అత్యంత కీలకమైన రక్షణ విధులకు సైతం ప్లాస్టిక్ వ్యర్థాలు ఇబ్బందులు కలిగిస్తుండడంపై ప్రజల్లో ఇకనైనా మార్పు రావాల్సిన అవసరం ఉంది.
ఇవీ చదవండి: