పధ్నాలుగేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ ఒక్క మంచి పనీ చేయలేదని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఎన్నికలప్పుడు మాత్రమే తెదేపాకు ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తుకొస్తారని మండిపడ్డారు. ఈ మేరకు విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్సార్, జగన్ నేతృత్వంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే.. అది చూసి ఓర్వలేక చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర రక్షణ పేరుతో తెలుగుదేశం నేతలు వేదిక ఏర్పాటు చేయడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.
గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు అలసత్వం వల్లే.. నేడు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఈ దుస్థితి వచ్చిందన్నారు. విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కార్మికులంతా రోడ్లమీదకు వచ్చి నిరసన తెలుపుతుంటే తెదేపా అగ్ర నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎవరి హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందో చర్చకు తాము సిద్ధమని.. అందుకు తెదేపా నేతలు సిద్ధమా అని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: