సమాజంలో ఆడబిడ్డలపై దాడులు జరగకుండా చూసుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర ఉండాలని.. మరీ ముఖ్యంగా తల్లి పాత్ర కీలకమని హోం మంత్రి వనిత వ్యాఖ్యానించారు. తల్లి ఆడబిడ్డలకు రక్షణగా ఉండి సంరక్షణ ఇవ్వాలని.. ఎలాంటి అఘాయిత్యాలూ జరగకుండా చూసుకోవాలని అన్నారు. తల్లి పాత్ర సరిగ్గా పోషించకుండా.. పోలీసులదే బాధ్యతంటూ తోసివేయడం సరికాదని వ్యాఖ్యానించారు. విశాఖలో దిశ పోలీస్ స్టేషన్ను పరిశీలించిన ఆమె.. గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళ పోలీసు వ్యవస్థను తీసుకొచ్చి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు.
ఆ ఘటన ఏ తల్లి పెంపకం తప్పో చెప్పాలి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత డిమాండ్ చేశారు. తల్లులను బయటికి తీసుకొచ్చి హోంమంత్రి కించపరుస్తున్నారని ఆమె మండిపడ్డారు. రేపల్లెలో అత్యాచారం ఘటన ఏ తల్లి పెంపకం తప్పో హోంమంత్రి చెప్పాలన్నారు. ఒక ఆడది అయ్యుండి మరో తల్లిగురించి నీచంగా మాట్లాడటం బాధాకరమన్నారు. అసమర్థ పాలనను తల్లుల పెంపకంపై నెట్టే స్థాయికి దిగజారిందని మండిపడ్డారు. మహిళలపై వరుసగా ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా.. జగన్ మూగ సీఎంలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: Gang Rape: టైమ్ అడిగి భర్తతో వివాదం.. ఆపై భార్యపై అత్యాచారం: బాపట్ల ఎస్పీ