విశాఖ దుర్ఘటన ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి పూర్తి అదుపులో ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కన్నబాబు వివరాలు వెల్లడించారు.
రెండు కమిటీలు అధ్యయనం
'గ్యాస్ లీకేజీ ప్రమాద స్థలం పరిసరాల్లో విషవాయువు ప్రభావం వేగంగా తగ్గుతోంది. దీనిని మరింత తగ్గించే చర్యలు కొనసాగుతున్నాయి. 5 గ్రామాల ప్రజలను ఆదివారం సాయంత్రం వరకు వెంకటాపురం వెళ్లవద్దని కోరాం. ప్రమాద ఘటనపై ఇంటర్నల్ కమిటీ వేశాం. ఇందులో సాంకేతిక నిపుణులు ఉంటారు. వీరు ఇప్పటికే పరిశ్రమ వద్దకు వెళ్లారు. దీనితో పాటు మెడికల్ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమ చుట్టుపక్కల ప్రజారోగ్యంపై దీర్ఘకాలంలో విష వాయువు ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేస్తుంది. మెడికల్ కమిటీ ఆదివారం నుంచే అధ్యయనం మొదలుపెడుతుంది. బాధితులకు పరిహారం మొత్తాన్ని రెండు రోజుల్లో అందిస్తాం. చనిపోయిన పశువులకు పరిహారం ఇస్తాం' అని మంత్రి కన్నబాబు అన్నారు.
సరుకులు వాడొద్దు
విశాఖ పరిసరాల్లోని రసాయన పరిశ్రమలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ చుట్టు పక్కల బోరు బావుల్లోని నీరు తనిఖీ చేస్తామన్నారు. పరిశ్రమ పరిసరాల్లోని ప్రజలు ఇంట్లో ఉన్న నిత్యావసరాలు వాడవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ నివేదిక వచ్చే వరకు పరిశ్రమ పూర్తిగా మూసివేసే ఉంటుందని... దర్యాప్తు అనంతరం కమిటీ సిఫారసుల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.
ఇదీ చదవండి