ప్రసాద్ పథకంలో భాగంగా వెయ్యి కోట్ల రూపాయలతో రాష్ట్రానికి సంబంధించి ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించినట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ... తాజాగా సింహాచలం ప్రాజెక్టును ప్రసాద్ పథకంలో చేర్చినట్టు కేంద్రం తెలిపిందన్నారు. మిగిలిన ప్రాజెక్టులకు ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద నిధులను మంజూరుకు పరిశీలిస్తున్నారని వివరించారు.
రాయలసీమ హెరిటేజ్, అరకు ఎకోటూరిజం ప్రాజెక్టు, సింహాచలం దేవస్థానంలో వివిధ పనులు, ద్వారకా తిరుమల దేవస్ధానం, శ్రీముఖలింగేశ్వర స్వామివారి దేవస్ధానం, అన్నవరం దేవస్ధానం పనులు ఇంతవరకు మంజూరు చేశారన్నారు. రాజమహేంద్రవరం హెరిటేజ్, ఎకో, నేచర్ టూరిజం సర్క్యూట్ (అఖండ గోదావరి), కొల్లేరు ఎకోటూరిజం, తిరుపతి టెంపుల్ టౌన్ అభివృద్ది, దుర్గామల్లేశ్వర స్వామి దేవస్ధానంలో అభివృద్ది పనుల ప్రాజెక్టులకు ఇంకా ఆమోదం లభించాల్సి ఉందన్నారు. ఇంతవరకు ఐదొందల కోట్ల రూపాయల మొత్తానికి ఆమోదం ఇచ్చారని మంత్రి వివరించారు. మరో 453 కోట్ల రూపాయలకు ఆమోదం లభించాల్సి ఉందని మంత్రి ముత్తంశెట్టి వివరించారు.
ఇదీ చదవండీ... డోర్ డెలివరీ వాహనాల్లో రూ. 63 కోట్లు ఆదా: పౌరసరఫరాల శాఖ