మాహరాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ (మాన్సస్) ట్రస్టును.. 1958లో పూసపాటి వంశీయులైన దివంగత పీవీజీ రాజు స్థాపించారు. విద్యను ప్రోత్సహించేందుకు.. విద్యా సంస్థల నిర్వహణ కొనసాగించడానికి ఈ ట్రస్టు అండగా నిలుస్తోంది. ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులే ఈ ట్రస్టు బాధ్యతలు చూసుకుంటున్నారు.
108 ఆలయాలు, 14 వేల 800 ఎకరాల విలువైన భూములను మాన్సస్ ట్రస్ట్ కలిగి ఉంది. విద్యా సంస్థలకు నిరంతర మద్దతు కోసం ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రత్యేక ఎంవోయూ కుదుర్చుకున్నారు. ట్రస్ట్ డీడ్ వారసత్వంగా.. "ఎల్డెస్ట్ మేల్ లీనియల్ వారసుడు" బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిబంధన ప్రకారంగా.. నాడు పీవీజీ రాజు ట్రస్ట్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మరణానంతరం... 1994లో ఆయన పెద్ద కుమారుడు పూసపాటి ఆనంద్ గజపతి రాజు ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు.
2016లో ఆనంద్ గజపతి రాజు మరణం తరువాత పీవీజీ రాజు రెండో కుమారుడు... అశోక్ గజపతి రాజు ఆ పదవి చేపట్టారు. నేటి వరకు ఆయనే ఛైర్మన్‌గా.. అశోక్ రెండో కుమార్తె అదితి గజపతిరాజు సభ్యురాలుగా ఉన్నారు.
తాజాగా... కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును ప్రభుత్వం తొలగించి... ఆయన స్థానంలో ఆనంద గజపతి రాజు కుమార్తె సంచితా గజపతి రాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు.. ఆమె అధికారిక లాంఛనాలతో ట్రస్టు ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ అన్యూహ పరిణామం.. మాన్సస్ ట్రస్టు సభ్యులు, ఉద్యోగుల్లోనే కాకుండా.. తెదేపా శ్రేణులను ఉలిక్కిపడేలా చేసింది. ఆనంద గజపతి, అశోక్ గజపతి ఇద్దరూ స్వయానా సొదరులే అయినప్పటికీ.. ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలుండేవి. అశోక్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆనంద్ కాంగ్రెస్, తెదేపాలో పనిచేశారు.
ఆనంద గజపతి రెండో వివాహం చేసుకున్నారు. ఈయన రెండో భార్య.. రెండో కుమార్తే సంచిత గజపతి. ప్రస్తుతం ఈమె దిల్లీలోనే ఉంటూ అక్కడ భాజపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత ఎన్నికల సమయంలో సంచిత గజపతి విశాఖలో భాజపా కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.
సంచితకు, తన పిన తండ్రి అశోక్ గజపతి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు లేనట్లు తెలుస్తోంది. ఇక్కడి వ్యవహారాలకు ఆమె దూరంగానే ఉంటున్నారు. అయితే భాజపాలో చేరిన తర్వాత విశాఖ, విజయనగరం ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించడం, స్వచ్ఛ భారత్ వంటి కార్యకలాపాల్లో భాగమయ్యారు.
మొదటి నుంచి స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న సంచిత, భాజపాలో చేరిన తర్వాత జోరు పెంచడమే కాకుండా విశాఖకు కార్యకలాపాలను విస్తరించారు. ఇప్పుడు సింహాచలం ట్రస్ట్ బోర్డు, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా సంచిత రావడం వెనుక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక... తెదేపాలో ఉన్న అశోక్ కు.. ఆయన కుమార్తె అదితికి చెక్ పెట్టేందుకు ఆనంద గజపతి వారసులను తెరపైకి తెచ్చారనే చర్చ జరుగుతోంది.
సింహాచలం బోర్డు ఛైర్మన్, మాన్సస్ ట్రస్టు ఛైర్మన్‌గా సంచిత గజపతిరాజు నియామకం చెల్లదంటూ అశోక్ గజపతి రాజు పత్రిక ప్రకటన విడుదల చేశారు. మాన్సస్ ట్రస్టు 1958లో తన తండ్రి పీవీజీ రాజు ఏర్పాటు చేశారని అప్పట్లో చేసుకున్న ఒప్పందాల మేరకు తాను వ్యవస్థాపక ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతున్నానని పేర్కొన్నారు. ఆమె నియామకం చట్టవిరుద్ధమన్నారు. ప్రస్తుతం.. అశోక్ గజపతిరాజు ఆరోగ్య పరీక్షల నిమిత్తం దిల్లీలో ఉన్నారు.
ఇవీ చదవండి: