ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు భారత నౌకాదళం.. అమెరికా, జపాన్, అస్ట్రేలియా నౌకాదళాలతో కలిసి మలబార్ విన్యాసాలు(Malabar Exercise) నిర్వహిస్తోంది. 25వ విడత విన్యాసాలకు పశ్చిమ పసిఫిక్లో అమెరికా నేవీ ఆతిథ్యం ఇస్తోంది. విన్యాసాల్లో అడ్మిరల్ తరుణ్ సోబ్టి సారధ్యంలో భారత యుద్ద నౌకలు.. శివాలిక్, కడ్మట్, పీ8ఐ ఎయిర్ క్రాప్టులు, పాల్గొంటున్నాయి. జపాన్ నుంచి కగ, మురసామె, షిరౌని, పీ1 ఎయిర్ క్రాప్టులు తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అస్ట్రేలియా నేవీ నుంచి యుద్ద నౌక వర్రంగా విన్యాసాలకు హాజరైంది. ఈ సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్.. యూఎస్ నేవీతో వివిధ అంశాలను పంచుకున్నారు.
25వ మలబార్ విన్యాసాలు పూర్తి సంక్లిష్టంగా రూపొందించారు. యాంటీ సర్ఫేస్, యాంటి సబ్ మెరైన్ యుద్ద నౌకావిన్యాలు ఇందులో ప్రముఖంగా ఉంటున్నాయి. చాలా చాకచక్యం అవసరమైన విన్యాసాలు నిర్వర్తించాల్సి ఉంది. స్నేహపూరిత నౌకాదళంతో చేసే విన్యాసాలు ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో పూర్తి ప్రత్యేకంగా చేపట్టారు. 1992లో ఆరంభమైన ఈ విన్యాసాలలో క్రమంగా సభ్యదేశాల సంఖ్య పెరిగింది. నాలుగుదేశాల మధ్య నౌకా రంగం, రక్షణ రంగంలోనూ సహకారం పెంపొందించేందుకు వీలుగా ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు.