Andhra University: అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ విశాఖలోని ఆంధ్ర వర్సిటీ పూర్వ విద్యార్థులు నిర్వహించిన ‘చలో ఆంధ్ర విశ్వవిద్యాలయం’ ఉద్రిక్తతకు దారితీసింది. తమకు అనుకూలమైన వారికి పదవులు కట్టబెడుతున్నారని పూర్వ విద్యార్థులు ఆరోపించారు. దీనికి నిరసనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం మార్చి 3న చేపట్టిన ఆందోళనకు తెదేపా, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. దీనికి పోటీగా వైకాపా అనుకూల విద్యార్థి సంఘం ‘మహాధర్నా’కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వర్సిటీ ప్రాంగణం చుట్టూ ఎన్నడూ లేనంతగా వందలాది పోలీసులను మోహరించారు. బుధవారం రాత్రినుంచే ఏయూ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
Tension at Andhra University: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తెదేపా ముఖ్యనేతలు బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు, పీలా శ్రీనివాసరావు,.. జనసేన నేతలు బొలిశెట్టి సత్య, శివశంకర్, బి.శ్రీనివాసపట్నాయక్, విద్యార్థి సంఘ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. మద్దిలపాలెం కూడలి వద్ద భారీ బందోబస్తు ఉన్నప్పటికీ జనసేన నాయకులు బొడ్డేపల్లి రఘు, వన్నెంరెడ్డి సతీశ్‌కుమార్‌ల నేతృత్వంలో పలువురు ఆందోళనకారులు.. ఏయూ ఇంజినీరింగ్ కళాళాల మార్గంలోకి ప్రవేశించారు. తోపులాటల మధ్య వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జీవీఎంసీ కార్యాలయం సమీపంలో ఉన్న టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్, తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేశ్, ఏయూ విశ్రాంత ఆచార్యుడు కె.జాన్ తదితరులను రెండో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి,.. విభజన హామీల అమలు సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు ఆందోళనకారులను పరామర్శించారు.
శాంతియుతంగా చేపట్టిన ‘చలో ఆంధ్ర విశ్వవిద్యాలయం’ అడ్డుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదని మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు.
ఇదీ చదవండి: