విశాఖ ఆరిలోవలో రెండు రోజుల క్రితం జరిగిన రౌడీషీటర్ సాయి హత్య ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అతడితో పాటు ఉంటూ కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. సాయి నుంచి ఎదురవుతున్న వేధింపులు భరించలేకే అతడి ప్రాణాన్నీ తీసినట్లు అనుమానిస్తున్నారు. రౌడీషీట్ కలిగిన సాయి గతంలో రవీంద్రనగర్‌లో నివాసం ఉండేవాడు. తనకున్న పరిచయాలతో చిన్నపాటి సెటిల్‌మెంట్లలో పాలు పంచుకునేవాడు.
ఈ క్రమంలో ఆరిలోవ ప్రాంతానికి చెందిన ఓ గ్యాంగ్‌తో సాయికి స్నేహం కుదిరింది. ఆరు నెలల క్రితం అతను ఆరిలోవకు మారిపోవటం, తన పరిధిని విస్తరించి కార్యకలాపాలు జరుపుతుండటంతో ఆ గ్యాంగ్‌కు నచ్చలేదు. తమను చిన్న చూపు చూస్తున్నాడని, పోలీసులకు తమపై తప్పుడు సమాచారం ఇస్తున్నాడని భావించిన గ్యాంగ్‌లోని ముగ్గురు యువకులు సాయిని హతమార్చాలని ముందుగానే ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.
శనివారం రాత్రి అతడు బయటకు వచ్చే సమయంలో కాపు కాసి కత్తులు, రాడ్‌లతో దాడి చేసి హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సాయి హత్యలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. హత్యకు పాల్పడిన వారిలో ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడి కుమారుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. విచారణ పూర్తైన తర్వాత పూర్తి వివరాలను పోలీసులు తెలియజేసే అవకాశముంది.
ఇదీ చదవండి: