గాంధీ చూపిన శాంతియుత మార్గం, స్థానికి స్వపరిపాలన దేశాభివృద్ధికి దోహదపడుతుందని లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. విశాఖ గీతం విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బుధవారం నిర్వహించిన 'గాంధీ సంప్రదాయం... ఆధునికత' అనే అంశంపై ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా గాంధీ మహాత్ముడిని అర్థం చేసుకోవడంలో, ఆయన మార్గాన్ని అనుసరించడంలో దేశం నేటికీ తడబడుతూనే ఉందన్నారు. దేశంలో నేడు గాంధీజీ ఆలోచనలకు విరుద్ధంగా అధికారం ఒకేచోట కేంద్రీకృతమైందని... ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఓటుహక్కును వినియోగించుకోవడంలో చదువు లేనివారికి.. చదువుకున్న వారికి మధ్య పెద్ద తేడా లేదన్నారు. దేశంలో ప్రజలకు కొంతవరకు రాయితీలు అవసరమేనని.. అయితే ప్రభుత్వాలు ప్రణాళికతో వ్యవహరించకపోతే ఆర్థిక సంక్షోభం తప్పదని హెచ్చరించారు. సమాజాన్ని, వ్యక్తులను ఏకతాటిపై నిలిపేందుకు గాంధీ ప్రయత్నించారని, ప్రస్తుతం సమాజంతో సంబంధం లేకుండా వ్యక్తులు ఎదగాలని చూస్తున్నారని.. దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుందని చెప్పారు.
ఇదీ చదవండి :