బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో మరో 24 గంటలపాటు వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. జాయింట్ కలెక్టర్ సృజన ఇతర ఉన్నతాధికారులు ముంపు ప్రాంతాలను సందర్శించారు. ప్రజల కోసం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెదేపా నేతలు గణబాబు, గంటా శ్రీనివాసరావులు తమ నియోజకవర్గాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వర్షాల కారణంగా ఇప్పటివరకు 14 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 257 హెక్టార్లలో పంట నీట మునిగింది. తొట్లకొండలో పురాతన బౌద్ధ స్థూపం వర్షాల ధాటికి కుప్పకూలింది. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. మరో 24 గంటలపాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ హెచ్చరికలతో గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు.
తాండవ నదిలో పెరిగిన వరద
పాయకరావుపేట తాండవ నదిలో వరద నీరు పెరిగింది. సాగునీటి కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. చాకలి పేట, శాంతి నగర్, పల్లివీధి వాసులను ముంపు బారిన పడకుండా అధికారులు ముందస్తుగా ఖాళీ చేయించారు. జాతీయ రహదారిపై కొత్తగా నిర్మిస్తోన్న వంతెన నిర్మాణ పనులు నీటి విడుదల కారణంగా నిలిచి పోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో వంతెనలు లేక ఆయా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. దేవరాపల్లి మండలం రైవాడ జలాశయంలో నీటిమట్టం 113.56 మీటర్లకు చేరుకుంది. అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు రెండు గేట్లు ద్వారా 2 వేల 200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. చీడికాడ మండలం కోనాం జలాశయం నుంచి 350 క్యూసెక్కులు, మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుంచి 1,658 కూసెక్కుల వరదనీటిని కిందకు విడుదల చేశారు.
ఇదీ చూడండి: