తాగునీటి పంపుసెట్ల ప్రక్షాళన కోసం విశాఖ నగర పాలక సంస్థ రూ.8.75 కోట్లను వెచ్చిస్తోంది. స్మార్ట్‌సిటీ మిషన్ కింద రూ. 6 కోట్లు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధుల నుంచి రూ. 2.75 కోట్లను అధికారులు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే అనుమతులు రాగా.. ప్రస్తుతానికి 21 మోటార్లు కొనుగోలు చేసేందుకు ఆర్డర్లు పెట్టారు. భవిష్యత్తులో సామర్థ్యం పెంపునకు మరిన్ని తెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొన్నిమోటార్ల దిగుమతి
24×7 తాగునీటి ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే కొన్నిమోటార్లను దిగుమతి చేసుకున్నట్లు జీవీఎంసీ ప్రధాన ఇంజినీరు ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. మరిన్ని త్వరలో వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడించారు. తాజాగా వచ్చే మోటార్లు స్టార్ రేటెడ్ వేనని చెబుతున్నారు. ప్రస్తుతం గోస్తనీ, మేఘాద్రిగెడ్డ, రైవాడ, టీఎస్సార్ తదితర పంపుహౌస్‌ల్లో మోటార్ల మార్పునకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎస్‌ఈ వినయ్‌కుమార్ పేర్కొన్నారు.
పంపిణీలో మార్పులు:
భారీమోటార్లు మారుస్తున్న పంపుహౌస్‌లన్నీ నగరానికి తాగునీటినిచ్చే కీలక పథకాలే. వీటిలో 15ఏళ్లకు మించి నడుస్తున్న మోటార్లను గుర్తించారు. ఇవన్నీ భారీ విద్యుత్తుబిల్లుల్ని తెచ్చిపెడుతుండటంతో పాటు నీటిసరఫరాలో వేగాన్ని తగ్గించాయి. ఈ మోటార్లతో సుమారు 60-80 శాతం సమర్ధత తగ్గినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొన్నాళ్లలో మార్చే కొత్తమోటార్ల ద్వారా ఈ వెలితిని భర్తీచేయవచ్చని.. తాగునీటి పంపిణీలో మరింత సమర్థత వస్తుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: