ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాను ఈ ఏడాది ‘గీతం ఫౌండేషన్ అవార్డు’కు ఎంపిక చేసినట్లు గీతం డీమ్డ్ వర్శిటీ వీసీ ఆచార్య కె.శివరామకృష్ణ తెలిపారు. ఈ రోజు జరగనున్న గీతం 41వ వ్యవస్థాపక దినోత్సవంలో అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ ఈ అవార్డును అందజేస్తారని పేర్కొన్నారు.
విద్య, వైద్యం, ఆర్థిక, విజ్ఞానశాస్త్ర రంగాలతో పాటు కళలు, సాహిత్య రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను గుర్తించి ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తున్నామని తెలిపారు. అవార్డు గ్రహీతకు ప్రశంసాపత్రంతో పాటు రూ.10 లక్షల నగదు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన ఎన్నో పురస్కారాలతోపాటు భారత ప్రభుత్వ ‘పద్మశ్రీ’ అవార్డు కూడా అందుకున్నారని వీసీ వివరించారు. ఈ అవార్డుకు ఎంపికైన గులేరియా ఇప్పటికే విశాఖ చేరుకున్నట్లు గీతం వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: డ్యాంల నిర్వహణకు 400 మంది సాంకేతిక సిబ్బంది అత్యవసరం