Future plan for visakha steel plant agitation : విశాఖ ఉక్కు పరిరక్షణే ధ్యేయంగా కార్మిక సంఘాలు మరోసారి ఉద్ధృత పోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. ఆందోళనలు మొదలై ఏడాదవుతున్న సందర్భంగా.. ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. కేంద్రంపై ఒత్తిడి తీవ్రం చేసే దిశగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ "విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు" నినాదంతో మొదలైన కార్మికుల నిరసనలు మళ్లీ తీవ్రరూపం దాల్చనున్నాయి. సుమారు సంవత్సర కాలంగా కార్మికులు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నా.. ప్రైవేటీకరణపై తగ్గేదే లేదంటూ కేంద్రం అడుగులు ముందుకే వేస్తోంది. ఈ చర్యలపై ఆగ్రహంతో ఉన్న కార్మిక సంఘాలు.. పోరును మరింత ఉద్ధృతం చేయాలని నిశ్చయించాయి. ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పోరాటాన్ని పదునెక్కించేలా కార్యాచరణ రూపొందించాయి. ఫిబ్రవరి 12 నాటికి పరిరక్షణ ఉద్యమం ఏడాది అవుతున్న వేళ.. కోటి సంతకాల సేకరణ చేపట్టనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. 365 రోజుల పోరాటానికి గుర్తుగా 12వ తేదీన 365 జెండాలతో నిరసన ప్రదర్శన, 13న స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి విశాఖ భాజపా కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపడతారు. అదోరోజు భాజపా కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి : Four Districts JAC Meet : నాలుగు జిల్లాల జేఏసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం
అలా విభిన్న రూపాల్లో ఉద్ధృతంగా సాగే పోరాటాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లేలా.. ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్ చేపట్టాలని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నిర్ణయించింది.
" సంవత్సర కాలమైనా విశాఖ స్టీల్ ఫ్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామన్న కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. మా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం. ఏడాది కావస్తుండటంతో ఫిబ్రవరి 12న 365 మందితో రిలో నిరాహార దీక్ష చేస్తాం. ఫిబ్రవరి 13న విశాఖలో భాజపా కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే విధానంలో భాగంగా ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్ చేయనున్నాం. 24న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నాం. " -నరసింగరావు, ఛైర్మన్ విశాఖ ఉక్కు పోరాట కమిటీ
" ఫిబ్రవరి 14 నుంచి నెల రోజులపాటు కోటి సంతకాల సేకరణ చేయనున్నాం. విశాఖ జిల్లా బంద్ కు పిలుపునిస్తున్నాం. రాష్ట్ర బంద్ కూడా చేపట్టే దిశగా చర్చలు చేయనున్నాం. పార్లమెంటు సమావేశాల్లో కూడా మా గళం వినిపించేలా చర్యలు నిరసనలు చేపట్టబోతున్నాం. " -మంత్రి రాజశేఖర్, ఛైర్మన్ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి
ఇదీ చదవండి : Employee unions round table meeting: పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశాలు
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆందోళనలు ఆపేది లేదని.. అన్ని వర్గాలను కులుపుకొని ముందుకు సాగుతామని కార్మిక నేతలు అంటున్నారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునే దాకా ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టంచేస్తున్నారు.
దాదాపు 16 వేల 500 కుటుంబాల త్యాగంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుకు అప్పగించడం ఏంటని.. ఉక్కు కార్మికులు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. ఇన్నేళ్లుగా నిర్వాసితులకు న్యాయం చేయని కేంద్ర ప్రభుత్వం.. పరిశ్రమను అమ్మకానికి పెడితే సహించేది లేదంటున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి : Subbarao Guptha On Kodali Nani : మంత్రి కొడాలి నానితో పార్టీకి తీవ్ర నష్టం - సుబ్బారావు గుప్తా
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!