విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవాలో భాగంగా నక్కపల్లి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి పదేళ్ల క్రితమే ఏపీఐఐసి 3899 ఎకరాల భూములను సేకరించింది. అప్పట్లోనే భూ సేకరణను రైతులు వ్యతిరేకించినా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి, పలుమార్లు చర్చలు జరిపి డిఎల్పురం, వేంపాడు, రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, చందనాడా గ్రామాల నుంచి పచ్చని పంట పొలాలను తీసుకుంది. భూములకు కొంతమేర పరిహారం చెల్లించినా.. పండ్ల తోటలు, కొబ్బరి చెట్లకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. డిఫామ్ భూముల్లో సాగుచేస్తున్న రైతులు ఇప్పటికీ అధికారుల చుట్టు తిరుగుతున్నారు.
వీటినేవి పట్టించుకోకుండానే అధికారులు పారిశ్రామిక పార్కు పేరిట సేకరించిన భూముల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లకు సిద్ధమైపోతున్నారు. ఈ వ్యవహారం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. తమ సమస్యలను పరిష్కరించి, సందేహాలను నివృత్తి చేసిన తరువాతే ముందుకు వెళ్లాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాకాకుండా పరిశ్రమల ఏర్పాటు చేయాలని భావిస్తే తమ ప్రాణాలు తీసి.. వాటిపై ఇండస్ట్రియల్ పార్కు కట్టుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ - చెన్నై కారిడార్లో ఇదివరకే అచ్యుతాపురంలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేశారు. అందులోనూ ఎక్కువగా రసాయన పరిశ్రమలే ఉన్నాయి. అక్కడి పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థ జలాలను సముద్రంలోకి విడిచిపెడుతుండటం కారణంగా మత్స్యకారుల ఉపాధిపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. మామూలుగా సముద్రంలో వేటకు వెళ్లే వాళ్లకు ఒకటి, రెండు కిలోమీటర్లలోనే మత్స్య సంపద దొరికేది. తీరం వెంబడి పరిశ్రమలను నెలకొల్పడం వల్ల 10 కిలోమీటర్ల లోపలికి వెళ్లినా చేపలు పడడంలేదని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు.
పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని నక్కపల్లిలో పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పర్యావరణానికి హాని లేకుండా పరిశ్రమలను నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరిస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై స్థానికుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి.. సమస్యలను పరిష్కరించే ముందుకు వెళతామని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
ఇదీ చదవండి: